కప్పు ముంగిట శాంసన్ టెన్షన్ ! ఫెయిలవుతున్న ‌‌‌‌‌‌‌‌ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజూ.. ఆందోళనలో టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

కప్పు ముంగిట  శాంసన్ టెన్షన్ ! ఫెయిలవుతున్న ‌‌‌‌‌‌‌‌ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజూ.. ఆందోళనలో టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

(వెలుగు స్పోర్ట్స్ డెస్క్‌‌‌‌‌‌‌‌)

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగబోతున్న టీమిండియా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. టోర్నీకి చివరి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతోంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిషేక్ శర్మ తన మార్కు విధ్వంసాన్ని చూపెడుతుండగా... చాలా రోజులుగా పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కెప్టెన్‌‌ సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు ఫిఫ్టీలతో ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు.

నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌లో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ మెరుపులు మెరిపించడం.. జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌ సమష్టిగా సత్తా చాటడం.. ఇలా  అన్నింటా సానుకూలతలే కనిపిస్తున్నాయి. కానీ, ఒక్క ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో మాత్రం టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆందోళన చెందుతోంది. తనే ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్.

టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఈ కేరళ స్టార్ ఇంటర్నేషనల్ కెరీర్ మాత్రం ఎత్తుపల్లాల మధ్య సాగుతోంది. అద్భుత టైమింగ్, కళ్లు చెదిరే షాట్లతో కనువిందు చేసే సంజూ అంతే స్థాయిలో వైఫల్యాలతోనూ అభిమానులను నిరాశపరుస్తుంటాడు.

రాబోయే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్ కోసం సెలెక్టర్లు శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ కంటే సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌కే ఓటు వేసి పెద్ద బాధ్యతను అప్పగించారు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యతను సంజూకి కట్టబెట్టారు. కానీ, కప్పు  ముంగిట సంజూ వరుస వైఫల్యాలు అటు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను.. ఇటు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను కలవరపెడుతున్నాయి.

గిల్ స్థానంలో సంజూ... కానీ ఫలితం ? 
గతేడాది ఆసియా కప్ సమయంలో సంజూ శాంసన్‌‌ను మిడిల్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు పరిమితం చేసి, శుభ్‌‌‌‌‌‌‌‌మన్  గిల్‌‌‌‌‌‌‌‌కు అవకాశమిచ్చారు. కానీ అక్కడ సంజూ ఇమడలేకపోయాడు. గిల్ కూడా ఆశించిన మేర రాణించలేదు. దీంతో వరల్డ్ కప్ కోసం వ్యూహం మార్చిన సెలెక్టర్లు కీపర్ కమ్ ఓపెనర్ కోటాలో సంజూని ఎంపిక చేశారు. 

ఇందుకోసం వైస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న గిల్‌‌‌‌‌‌‌‌పై వేటు వేసి సాహసం చేశారు. కానీ, సెలెక్టర్ల నమ్మకాన్ని న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌లో సంజూ వమ్ము చేస్తున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో తను 10, 6, 0 స్కోర్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌ నుంచే హిట్టింగ్ చేసే అరుదైన టాలెంట్ ఉన్న శాంసన్ కొన్నాళ్లుగా పవర్ ప్లేలో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది జనవరి నుంచి ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా ఆడిన 9 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో సంజూ ఒక్కసారి మాత్రమే పవర్ ప్లే దాటి నిలబడగలిగాడు.  సంజూ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌కి వచ్చినప్పుడల్లా కొన్ని బలహీనతలు బయటపడుతున్నాయి. 

ఇది వరకు  ఇంగ్లండ్ బౌలర్లు వేగవంతమైన షార్ట్ పిచ్ బాల్స్‌‌‌‌‌‌‌‌తో అతడిని ఇబ్బంది పెడితే ఇప్పుడు న్యూజిలాండ్ పేసర్లు మాట్ హెన్రీ, కైల్ జేమీసన్ వికెట్ల లైన్ లేదా లెగ్-మిడిల్ లైన్‌‌‌‌‌‌‌‌లో బంతులు వేస్తూ  సంజూని ఆఫ్-సైడ్ షాట్లు ఆడకుండా కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజూ తన టెక్నిక్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసుకోవాలని మాజీ కోచ్‌‌‌‌‌‌‌‌  డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. 

‘సంజూ బ్యాట్ స్పీడ్ అన్ని రకాల బాల్స్‌‌‌‌‌‌‌‌కు ఒకేలా ఉంటోంది. 130 కి.మీ వేగంతో వచ్చే బాల్స్‌‌‌‌‌‌‌‌కు ఇది సరిపోతుంది కానీ, అంతకంటే ఎక్కువ స్పీడ్  లేదా పేస్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. బాల్‌‌‌‌‌‌‌‌ వేగానికి అనుగుణంగా తన బ్యాట్ స్పీడ్‌‌‌‌‌‌‌‌ను మార్చుకుంటే అతను మళ్ళీ గాడిలో పడతాడు’ అని రామన్ సూచించాడు.

ఇషాన్, తిలక్ నుంచి ముప్పు..
సంజూ ఫామ్ లేమితో సతమతమవుతుంటే, మరోవైపు ఇషాన్ దొరికిన అవకాశాలను రెండు చేతులా ఒడిసి పట్టుకుంటున్నాడు. రాయ్‌‌‌‌‌‌‌‌పూర్, గువాహతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అభిషేక్ శర్మతో కలిసి అదరగొట్టాడు. దీనికి తోడు గాయం నుంచి కోలుకుంటున్న  వరల్డ్ నంబర్ 3 బ్యాటర్ తిలక్ వర్మ  నేరుగా జట్టులోకి వస్తాడు. అప్పుడు అభిషేక్‌‌‌‌‌‌‌‌కు తోడుగా ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ, ఇషాన్ మధ్య నేరుగా పోటీ నెలకొంటుంది.  మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇప్పటికీ సంజూపై నమ్మకం ఉంచింది.

వైజాగ్, త్రివేండ్రంలో జరిగే తదుపరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అతనికి అవకాశం దక్కవచ్చు. సూర్యకుమార్ మూడు రోజుల్లోనే తన ఫామ్‌‌‌‌‌‌‌‌ను తిరిగి పొందినట్లుగా, సంజూ కూడా పుంజుకుంటాడని ఆశిస్తున్నారు. కానీ, ఈ అవకాశాలను కూడా చేజార్చుకుంటే మాత్రం, వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ముంగిట టీమిండియా మరోసారి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. సంజూ ఫ్యూచర్ ఇప్పుడు పూర్తిగా వచ్చే రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అతని బ్యాట్ నుంచి వచ్చే రన్స్‌‌‌‌‌‌‌‌పైనే ఆధారపడి ఉంది.