
- ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇళ్ల వద్దే బోధన
- జిల్లాలో 23 మంది టీచర్ల అపాయింట్ మెంట్
- రూ.కోటి 66 లక్షలతో సెంటర్లలో సౌకర్యాలు
- రూ.10 లక్షల చొప్పున ఆరు కొత్త బిల్డింగ్ నిర్మాణాలు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలను మామూలుగా మార్చడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. భవిత సెంటర్లలో వసతుల పెంపునకు రూ.కోటి 66 లక్షలు, కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఒక్కో సెంటర్‌కు రూ.పది లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. భవిత కేంద్రాలకు స్కాలర్షిప్స్తో ప్రోత్సాహం, ఫిజియోథెరపీ ఏర్పాట్లు చేస్తున్నారు. భవితకు రాలేని పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి బోధించేలా 23 మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
4,190 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు
జిల్లాలోని 29 భవిత సెంటర్లలో 4,190 మంది స్పెషల్ నీడ్ పిల్లలున్నారు. వారంతా ఒక్కోరకమైన వైకల్యంతో ఉన్నారు. అంధులు, చెవిటి, మూగ, బుద్ధి మాంధ్యం, కాళ్లు, చేతుల్లో వైకల్యం, నడవలేకపోవడం లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పుట్టు వైకల్యంతో జన్మించిన పిల్లల్లో మార్పు తీసుకొచ్చేందుకు భవిత సెంటర్లు పని చేస్తున్నాయి. స్పీచ్ థెరపీ, వాకింగ్ ప్రాక్టీస్, ఫిజియోథెరపీ, రీడింగ్ అండ్ లెర్నింగ్, రైటింగ్ ప్రాక్టీస్ వంటివి అక్కడ చేయిస్తారు. తమ పిల్లలను భవిత సెంటర్లో చేర్చేలా పేరెంట్స్‌ను ప్రోత్సహించేందుకు పేర్లు ఎన్రోల్ చేసిన పిల్లలకు స్కాలర్షిప్, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌గా ఏడాదికి దాదాపు రూ.6 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది.
పేరెంట్స్‌కు ఎస్కార్ట్ అలవెన్స్, రీడర్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఈ రకంగా జూన్ నెల జిల్లాలో రూ.28 లక్షలు పేమెంట్ జరిగింది. 13 మంది ఫిజియోథెరపీ డాక్టర్ల కోసం ఆఫీసర్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నిపుణులతో వైకల్యాన్ని నిర్ధారించాక పిల్లలకు వినికిడి యంత్రాలు, ట్రైసైకిల్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. స్పెషల్ నీడ్ పిల్లల ధ్యాసను చదువుపై మళ్లించడానికి మరిన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆసక్తి పెంచేందుకు చర్యలు..
జిల్లాలోని నిజామాబాద్ సౌత్, నందిపేట, ఆర్మూర్, మోర్తాడ్, సిరికొండ, ఎడపల్లి, బోధన్ మండలాల్లో భవిత సెంటర్లకు సొంత బిల్డింగ్లు ఉండగా, ఒక్కో సెంటర్‌కు రూ.2 లక్షలతో డిజేబుల్ లెర్నింగ్ మెటీరియల్ తెప్పించారు. మిగతా మండలాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో నడుస్తున్న సెంటర్లలో సౌకర్యాలు పెంచడానికి రూ.కోటి 66 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఫ్రెండ్లీ టాయిలెట్ నిర్మాణానికి రూ.1.70 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వెస్ట్రన్ వాష్‌రూమ్‌తో పాటు కింద జారిపడకుండా ప్రత్యేకమైన ఫ్లోర్, స్టాండ్, వాటర్ అరెంజ్మెంట్స్ చేయడానికి సోమవారం కలెక్టర్ ఆమోదం తెలిపారు.
ర్యాంప్, రెయిలింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. నవీపేట, మాక్లూర్, గూపన్పల్లి, రుద్రూర్, దుబ్బ, బాల్కొండ, మెండోరాలో రూ.10 లక్షలతో కొత్తగా సొంత భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. భవిత సెంటర్ల వరకు రాలేని పిల్లల ఇండ్లకు ప్రతి శనివారం వెళ్లి బోధించేందుకు 23 మంది స్పెషల్ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి నియమించారు. వారంలో ఒక రోజు స్పెషల్ నీడ్ పిల్లలకు చదువు చెబుతున్న ఈ టీచర్లు మిగతా ఐదు రోజులు సమీప స్కూల్స్‌కు వెళ్తున్నారు. వారి పూర్తి జాబ్ చార్ట్ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాల్సి ఉంది.
లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు
గతంతో పోలిస్తే స్పెషల్ నీడ్ పిల్లలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అధిక నిధులు కేటాయించి పిల్లల అవసరాలు తీర్చుతోంది. హోమ్ బేస్డ్ స్టడీ గొప్ప మార్పునకు నాంది కాబోతున్నది.
శ్రీనివాస్, సీఎంవో