సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్​

సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్​
  • దసరా కానుక ప్రకటించిన సీఎం
  • లాభాలు రూ.272.64కోట్లు.. కార్మికుల వాటా రూ.79.7కోట్లు
  • ప్రతి కార్మికునికి దాదాపు రూ.18వేలు
  • దీపావళి బోనస్‌‌ రూ.72,500

హైదరాబాద్‌‌/ మందమర్రి, వెలుగు : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంస్థకు ఈ యేడు  వచ్చిన లాభాల్లో కార్మికులకు  29 శాతం వాటాను ప్రకటించింది.  నిరుటి కంటే ఈఏడాది కార్మికులకు లాభాల్లో ఒకశాతం పెంచుతూ కార్మికులకు  మంగళవారం సీఎం కేసీఆర్‌‌  దసరా కానుక ప్రకటించారు. ప్రగతి భవన్ లో  సింగరేణిపై జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈయేడు సింగరేణి రూ.272.64 కోట్ల లాభాలు సాధించింది. ఇందులో 29శాతం వాటాగా రూ.79. 7 కోట్లు కార్మికులకు ఇవ్వనున్నారు.  మొత్తం 43వేల మంది కార్మికులుండగా.. ఒక్కొక్కరికి సరాసరిగా రూ.18వేలు దక్కనుంది.  లాభాల వాటా బోనస్​నే దసరాలోపే చెల్లించాలని సీఎండీ శ్రీధర్​ను సీఎం ఆదేశించారు. 
ఇతర గనుల్లో సింగరేణి కార్మికుల స్కిల్స్​ వాడుకుంటాం
సింగరేణి కార్మికుల సంక్షేమం, భవిష్యత్తుకు  ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. నిబద్దతతో పని చేస్తున్న కార్మికులు మైనింగ్, పవర్ జనరేషన్​లో సంస్థను అగ్రస్థానంలో నిలుపుతున్నారన్నారు.  బొగ్గుతవ్వకాల్లోనే కాకుండా ఇతర  ఖనిజాల తవ్వకాలలో సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని వాడుకుంటామన్నారు. ఇందుకోసం ప్లాన్​ రెడీ  అధికారులను సీఎం  ఆదేశించారు.  రిటైరయిన సింగరేణి కార్మికుల సేవలను వాడుకుని కార్పొరేట్ కంపెనీలు మైనింగ్​ రంగంలో లాభాలు సంపాదిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 
తక్కువ పెన్షన్‌‌ కార్మికులకు సాయంపై నివేదిక ఇవ్వండి..
సింగరేణి సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రూ.2వేలలోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పై సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు ఏవిధంగా సాయం చేయగలమో నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర రావు, దివాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియ నాయక్, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్,  టీబీజీకేఎస్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సంఘం నాయకులు కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
దీపావళి బోనస్‌‌..రూ.72,500
దేశంలోని కోల్​ వర్కర్లకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ఆర్) రూ.72,500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి  అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌‌పై చర్చించి  అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ.68,500గా నిర్ణయించగా ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచారు.