సాగని పయనం.. ఆగిన పాణం

సాగని పయనం.. ఆగిన పాణం
  • దారిలోనే చనిపోయిన బిడ్డ
  • కొత్తగూడెం జిల్లా శ్రీరాంపురంలో విషాదం
  • రోడ్డు బాగు చేయాలని చెప్పినా పట్టించుకోని ఆఫీసర్లు

బూర్గంపహాడ్, వెలుగు :ఆ ఊరికి సరైన రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఐదు నెలల బాలుడు దవాఖానాకు వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం శ్రీరాంపురం గిరిజన గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సారపాక పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం గిరిజన గ్రామానికి చెందిన శ్యామల వెంకయ్య, రత్తమ్మ దంపతుల ఒక్కగానొక్క కొడుకు చినబాబు(5 నెలలు) బుధవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పెద్దపెట్టున ఏడుస్తుండడంతో దవాఖానాకు తీసుకువెళ్దామని అనుకున్నారు. అయితే అప్పటికే భారీ వర్షం పడడంతో గ్రామం నుంచి సారపాకకు వెళ్లే రోడ్డు మొత్తం బురదమయమైంది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉండడంతో ఊరిలో ఆటో ఉన్నవాళ్లకు ఫోన్ ​చేశారు. రోడ్డుపై వాహనం వెళ్లడం సాధ్యం కాదని, తమకు సాయం చేయాలని ఉన్నా ఏమీ చేయలేకుండా ఉన్నామని చెప్పారు.  

మూడు కిలోమీటర్లు.. గంటసేపు నడక 
గత్యంతరం లేక తల్లిదండ్రులు బాలుడిని ఎత్తుకుని సారపాకకు నడుచుకుంటూ బయలుదేరారు.  శ్రీరాంపురం నుంచి సారపాకకు మూడు కిలోమీటర్లు ఉంటుంది. మామూలు సమయంలో నడుచుకుంటూ వెళ్తే 20 నిమిషాలు పడుతుంది. బురద రోడ్డు కావడం, అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో సుమారు గంటకు పైగానే టైం పట్టింది. మార్గమధ్యలో బాబు గుక్కపెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి అతి కష్టం మీద సారపాక చేరుకున్నా అక్కడి నుంచి భద్రాచలంలోని దవాఖానాకు వెళ్లాలంటే మరో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఆటోలో వెళ్తే కనీసం10 నిమిషాలు పడుతుంది. ఎలాగో ఓ ఆటోను మాట్లాడుకుని భద్రాచలానికి పయనమయ్యారు. మధ్యలో ఓ చోట బాబు ఏడుపు ఆపెయ్యడంతో వారికి ఏం జరిగిందో అర్థమయ్యింది. లేపడానికి ఎంత ప్రయత్నించినా చలనం లేకుండా ఉండిపోయాడు. కానీ ఆశతో దవాఖానాకు చేరుకోగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ప్రాణం పోయిందని చెప్పారు. ఊరికి సరైన రోడ్డు లేకపోవడం వల్లే తమ కొడుకు చనిపోయాడని బాలుడి తల్లితండ్రులు గుండెలు బాదుకున్నారు. రోడ్డెయ్యాలని ఎన్నోసార్లు ఐటీడీఏ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, అయినా స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు.