వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం.. వానకాలం సీజన్లో

వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం..  వానకాలం సీజన్లో
  • వానకాలం సీజన్​లో 
  • జిల్లాలో 426 కొనుగోలు సెంటర్ల ఏర్పాటు
  • 5.98 లక్షల మెట్రిక్​ టన్నులు వస్తుందని అంచనా
  •  వర్షాలకు పంట దెబ్బతినడం వల్ల కొంత తగ్గే అవకాశం 

కామారెడ్డి, వెలుగు : వానకాలం సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కొన్ని ఏరియాల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి వరి కోతలు ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 426 వడ్ల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సగం 213 సెంటర్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. మరో 213 సెంటర్లు సింగిల్​విండోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. 

ఈసారి జిల్లాలో 2,85,825 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. దిగుబడి 6,88,838 మెట్రిక్​ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేశారు. స్థానిక అమ్మకాలు, రైతుల అవసరాలకు కొంత ఉంచుకోగా, సెంటర్లకు 5,98,288 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. అయితే జిల్లాలో 15 రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది. ఈ ప్రభావంతో పంటల దిగుబడి తగ్గనుంది. 

కోటీ 50 లక్షల గన్ని బ్యాగులు..

ఈ సీజన్​లో వడ్ల కొనుగోళ్లకు కోటీ50 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయి. ఇప్పటికే  సివిల్​సప్లయ్ అధికారుల వద్ద 36 లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయి. మరో 25 లక్షల బ్యాగులు వారం, పది రోజుల్లో జిల్లాకు రానున్నాయి. గన్ని బ్యాగులు, ట్రాన్స్​ఫోర్ట్, కాంటాలు, తేమ యంత్రాల సమస్య లేకుండా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. మిగతా ఏరియాల కంటే బాన్సువాడ ఏరియాలో వరి కోతలు ముందుగా ప్రారంభమవుతాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వరి నాట్లు ఆలస్యంగా వేస్తారు.  

దొడ్డు రకమే ఎక్కువ..

జిల్లాలో దొడ్డు రకం వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతోంది. ఈ సీజన్​లో 2,85,825 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో దోడ్డు రకం 2,00,077 ఎకరాలు, సన్నరకం 85,748 ఎకరాల్లో సాగు చేశారు.  దొడ్డు రకం 5,00,197 మెట్రిక్ టన్నులు, సన్న రకం 98,091 మెట్రిక్​ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.  

వరి పంటకు పెద్ద దెబ్బ..

ఆగస్టు చివరి వారంలో జిల్లాలో 2 రోజులపాటు అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో 80 వేల ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది.  నాగిరెడ్డిపేట, లింగంపేట, మహమ్మద్​నగర్, కామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, తాడ్వాయి, భిక్కనూరు, పాల్వంచ, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, దోమకొండ, బీబీపేట తదితర మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. 16 వేల ఎకరాల వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. 

సగం సెంటర్లు మహిళా సంఘాలకు..

వడ్ల కొనుగోళ్లకు మొత్తం 426 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సగం సెంటర్లు  (213) మహిళా సంఘాలకు కేటాయించారు.  గతంలో  మహిళా సంఘాలకు 40 సెంటర్లను మాత్రమే కేటాయించగా, మిగతావి సొసైటీల ఆధ్వర్యంలో ఉండేవి. ప్రభుత్వం గత సీజన్ నుంచి మహిళా సంఘాలకు ఎక్కువ సెంటర్లు కేటాయించాలని నిర్ణయించింది. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెంటర్లు సగం వారికే కేటాయించింది.