- ములుగులో రిఫరల్ కేసులకు 20 పడకల వార్డు
- జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు
ములుగు, వెలుగు: మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తులకు ఆరోగ్య సేవలు అందించేందుకు 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తున్నామని, అక్కడి నుంచి రిఫరల్ గా వచ్చే కేసుల కోసం ములుగు జిల్లా ఆస్పత్రిలో 20 పడకల వార్డులను ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్వో గోపాల్ రావు తెలిపారు. బుధవారం ములుగు ఆస్పత్రిలో సూపరింటెండెంట్చంద్రశేఖర్, వైద్యులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 28 నుంచి 31వరకు జరిగే మేడారం మహాజాతరలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందస్తు ప్రణాళికపై చర్చించారు. మేడారం భక్తులకు ఆరోగ్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందిస్తామన్నారు.
మేడారం, ములుగుతోపాటు వరంగల్ ఎంజీఎంలో కూడా వైద్యసేవలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వైద్య కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, మందులు, వైద్య పరికరాలు సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు పవన్ కుమార్, శ్రీకాంత్, ఏడీ గఫర్, వైద్యాధికారి గౌతం, డీపీఎం సంజీవరావు, జిల్లా ఫార్మసీ ఇన్‌చార్జి వినోద్, మానిటరింగ్ సూపర్వైజర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
