6,500 ఏళ్ల నాటి సమాధిలో కిలోన్నర బంగారం: ప్రపంచంలోనే అత్యంత పురాతన నిధి!

 6,500 ఏళ్ల నాటి సమాధిలో కిలోన్నర బంగారం: ప్రపంచంలోనే అత్యంత పురాతన నిధి!

బల్గేరియాలోని 'వర్నా నెక్రోపోలిస్' అనే ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఒక అద్భుతమైన విషయం వెలుగుచూసింది. సుమారు 6,500 ఏళ్ల క్రితం నాటి ఒక సమాధిలో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వస్తువులు దొరికాయి. 

మానవ చరిత్రలో ఇప్పటివరకు దొరికిన బంగారు వస్తువులన్నింటిలో ఇవే అత్యంత పాతవి, పురాతనమైనది. అంటే, మనుషులు రాగి యుగంలోనే బంగారం వాడటం, దాన్ని నగలుగా మార్చడం నేర్చుకున్నారని దీనివల్ల తెలుస్తోంది.

అక్కడ దాదాపు 300 సమాధులు ఉన్నప్పటికీ, 'సమాధి 43' శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఇందులో ఏకంగా 1.5 కిలోల బంగారం లభించింది. ఆ కాలంలో ఒక వ్యక్తి దగ్గర  ఇంత బంగారం ఉందంటే, అతను చాలా శక్తివంతుడైన పాలకుడు లేదా గొప్ప ధనవంతుడై ఉండొచ్చని భావిస్తున్నారు.

 అప్పట్లోనే సమాజంలో 'ధనిక-పేద' అనే తేడాలు ఉండేవని ఈ తవ్వకాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమైన వ్యక్తుల సమాధుల్లో మాత్రమే బంగారం దొరికింది, సామాన్యుల సమాధుల్లో ఎలాంటివి  లేవు. అంతేకాకుండా అక్కడ కేవలం బంగారమే కాదు, వేరే దేశాల నుండి తెచ్చిన అరుదైన రాళ్లు, సముద్రపు గవ్వలు కూడా దొరికాయి. అంటే 6,500 ఏళ్ల క్రితమే మనుషులు ఇతర దేశాలతో వ్యాపారాలు చేసేవారని స్పష్టమవుతోంది.

 బంగారం అనేది కేవలం ఈ కాలంలోనే కాదు, వేల ఏళ్ల క్రితమే అధికారం, హోదాకు చిహ్నంగా ఉండేదని ఈ ఆవిష్కరణ చాటిచెబుతోంది.