
- అందుకు అనుమతివ్వండి
హైదరాబాద్, వెలుగు: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఇరిగేషన్‌పై వైట్ పేపర్లు పెట్టిన ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు కూడా వైట్ పేపర్ పెట్టే అవకాశం ఇవ్వాలన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై తాము వైట్ పేపర్ పెడతామని, అందుకు సభ అనుమతివ్వాలని కోరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దిగజార్చిందంటూ కాంగ్రెస్ సర్కార్ అంటున్నది.
ఆ విషయం తెలిసినప్పుడు బడ్జెట్ భారీగా అయ్యే ఆరు గ్యారంటీలను ఎలా ప్రకటించింది? బీపీఎల్ కుటుంబాలనే తీసుకున్నా ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి. ఇవే కాకుండా మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల అమలుకు మరో రూ.3.70 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే బాగాలేనప్పుడు ఇన్ని హామీలను రాష్ట్ర సర్కార్ ఎలా అమలు చేస్తుంది? అందుకే వీటిపై చర్చించేలా ప్రతిపక్షాలు వైట్ పేపర్ పెట్టేందుకు అనుమతివ్వాలి’’ అని డిమాండ్ చేశారు.
మైనారిటీ గురుకులాలకేవీ పైసలు?
బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల బిల్డింగులకు నిధులు కేటాయించారని.. కానీ మైనారిటీ గురుకులాలను ఎందుకు విస్మరించారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో స్టూడెంట్లకు ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. టైపింగ్ పొరపాటు వల్ల మైనారిటీ గురుకులాల అలకేషన్లు బడ్జెట్లో మిస్సయ్యాయని చెప్పారు. స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇచ్చేలా కాలేజీలకు లేఖ రాస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించి, వక్ఫ్ భూములను కాపాడాలని ప్రభుత్వానికి అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.