ఆగస్టు 1 నుంచి హాస్పిటల్స్‌‌లో ఆధార్‌‌‌‌ అటెండెన్స్‌‌

ఆగస్టు 1 నుంచి హాస్పిటల్స్‌‌లో ఆధార్‌‌‌‌ అటెండెన్స్‌‌
  • ఆధార్ బేస్డ్ హాజరు అమలుకు ఆరోగ్య శాఖ సిద్ధం 
  • టీవీవీపీ, డీఎంఈ, డీపీహెచ్, ఆయుష్ ఆసుపత్రుల్లో అమలుకు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ (ఏబీఎస్ఏ)ను ఆగస్టు 1 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్‌‌) ఆధ్వర్యంలో ప్రవేశ పెడుతున్నారు. ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ తెలంగాణ విద్యా వైద్య పరిషత్ (టీవీవీపీ), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్), ఆయుష్ డిపార్ట్‌‌మెంట్‌‌లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి వర్తిస్తుంది. 

ఈ నూతన అటెండెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అటెండెన్స్ విషయంలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సిస్టమ్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సిస్టమ్‌‌లో ఉద్యోగులు తమ ఆధార్ కార్డును స్కాన్ చేసి అటెండెన్స్‌‌ను నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సిస్టమ్‌‌ను అమలు చేసే బాధ్యత టీజీటీఎస్‌‌ తీసుకుంది. 

ఈ వ్యవస్థ ప్రతి నెలా జిల్లా రాష్ట్ర స్థాయిలో రియల్-టైంలో అటెండెన్స్ డేటాను సేకరించి, అధికారులకు అందజేస్తుంది. కాగా, ఇప్పటివకే ఏబీఏఎస్‌‌ అమలుకు అధికారులు షెడ్యూల్‌‌ను కూడా రూపొందించారు. మరోవైపు, జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి అటెండెన్స్‌‌ సిస్టమ్‌‌ను సక్రమంగా నడిపేలా పర్యవేక్షిస్తారు. రాష్ట్రస్థాయిలో కమిషనర్, టీవీవీపీ, డీఎంఈ, డీపీహెచ్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఈ ప్రక్రియను నడిపించే బాధ్యత తీసుకుంటారు.