ఏసీబీకి చిక్కిన వనపర్తి సివిల్ సప్లై డీఎం.. మిల్లర్ నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

ఏసీబీకి చిక్కిన వనపర్తి సివిల్ సప్లై డీఎం.. మిల్లర్ నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

వనపర్తి, వెలుగు: సీఎంఆర్  వడ్లు కేటాయించేందుకు ఓ రైస్  మిల్లర్  నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వనపర్తి సివిల్  సప్లై డీఎం కుంభ జగన్మోహన్ తో పాటు ఆయన డ్రైవర్​ను గురువారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సీఎంఆర్  వడ్లు కేటాయించేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్  మిల్లర్ ను సివిల్​ సప్లై డీఎం రూ.1.75 లక్షలు డిమాండ్  చేయగా, రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.

ఆ తరువాత ఏసీబీని ఆశ్రయించగా, వారి సూచనల మేరకు డీఎంకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్  చేస్తే టోల్  ఫ్రీ నంబర్ కు ఫోన్  చేయాలని సూచించారు. డీఎం, డ్రైవర్​ను శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే సివిల్​ సప్లై డీఎం జగన్మోహన్​ ఏసీబీకి పట్టుబడడంతో పట్టణంలో సంబురాలు చేసుకున్నారు. డీఎం వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని మిల్లర్లు తెలిపారు. అనంతరం పటాకులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.