
అశ్విన్ బాబు, రియా సుమన్ జంటగా మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వంలో టి గణపతి రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’గురువారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు శైలేష్ కొలను.. టీజర్ చాలా బాగుందని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
‘ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్’అంటూ మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మెడికో థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా రివీల్ చేశారు.
ఈ సందర్భంగా అశ్విన్ బాబు మాట్లాడుతూ ‘ఊహకందని కొత్త కథాంశంతో ఈ చిత్రం రాబోతోంది. అది అందర్నీ మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నా. మనోజ్ అన్న వాయిస్ టీజర్‌కు ప్రాణం పోసి మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉంటుంది’అని చెప్పాడు. అలాగే అశ్విన్ బాబు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’సినిమాకు మ్యూజిక్ కొట్టి కొట్టి తమన్ బక్కగా మారిపోయారని అక్కడున్న ప్రేక్షకులు అనగా.. అశ్విన్ సరదాగా జవాబిచ్చారు. తమన్ తనకు ముందే చెప్పాడని, ‘ఓజీ’మూవీకి మ్యూజిక్ వేరే స్థాయిలో ఉంటుందని, అదిరిపోతుందని అశ్విన్ అన్నారు. సంగీత పరిశ్రమలో తమన్ ఒక సంచలనం అని, ఆయన మద్దతు తనకు ఎప్పటికీ ఉంటుందని అశ్విన్ స్పష్టం చేశారు.
ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉందని రియా సుమన్ చెప్పింది. టీజర్ నచ్చినట్టే, సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని డైరెక్టర్ కృష్ణ అన్నాడు. మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని నిర్మాత గణపతి రెడ్డి కోరారు. నిర్మాతలు కేఎస్ రామారావు, దామోదర ప్రసాద్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.