గంజాయి సాగుపై నిఘా.. ఆదిలాబాద్ ​జిల్లాలో 2 నెలలుగా పోలీసుల దాడులు

గంజాయి సాగుపై నిఘా.. ఆదిలాబాద్ ​జిల్లాలో 2 నెలలుగా పోలీసుల దాడులు
  • 34 కేసులు నమోదు 
  • 12 కిలోల ఎండు గంజాయి స్వాధీనం 
  • 56 మంది అరెస్ట్

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో గంజాయి సాగుపై పోలీసులు నిఘా పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, వ్యాపారులు వారి పంట పొలాల్లో అంతర పంటగా గంజాయి సాగు చేయిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్​ఆదిలాబాద్​నార్కోటిక్​బ్యూరోతో కలిసి గంజాయిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీన్ని సాగు చేస్తున్నవారు, విక్రయిస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. గత 40 రోజుల్లోనే జిల్లాలో 34 కేసులు నమోదవగా 56 మంది నిందితులను పోలీసులు అరెస్ట్​చేశారు. 12 కిలోల ఎండు గంజాయితోపాటు 120 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.24 లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. 

ప్రత్యేకంగా వాట్సాప్​ నంబర్​ ఏర్పాటు

గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలను రాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్​ 87126 59913 ఏర్పాటు చేశారు. ఏజెన్సీ మండలాలు నార్నూర్, ఉట్నూర్, నేరడిగొండ, తాంసి, తలమడుగు మండలాల్లోని గుట్టల కింద ఉండే చేలల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్​ ప్రాంతాల్లో గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి సరఫరా అవుతుండడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల అరెస్ట్ అయిన రౌడీషీటర్లు సైతం గంజాయి సేవించినట్లు దర్యాప్తులో తేలింది.  

పథకాల రద్దుకు సిఫారసు..

ఇటీవల ఉట్నూర్​మండలం కుమ్మరితండా పరిధిలోని రాములుగూడలో పోలీసులు దాడులు నిర్వహించారు. అరటి పంటలో సాగు చేస్తున్న 20 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, సదరు రైతుపై కేసు నమోదు చేశారు. అతనికి ప్రభుత్వ పథకాల రద్దు కోసం కలెక్టర్​కు సిఫారసు చేశారు.  గత నెల 29న ఇచ్చోడ మండలం సల్యాడలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి, ఆ మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.18 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​చేశారు.