- ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్
పిట్లం, వెలుగు : బిచ్కుంద మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేలా కాంగ్రెస్శ్రేణులు కృషి చేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ సూచించారు. గురువారం బిచ్కుంద కాంగ్రెస్ఆఫీస్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ బిచ్కుంద మున్సిపాలిటిలో 12 వార్డులకుగాను అంతమందికే టికెట్ఇవ్వగలమని, మిగతా నాయకులు నిరాశ చెందవద్దన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
హోటల్లో సాదాసీదాగా..
జుక్కల్ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ బిచ్కుంద రోడ్డు పక్కన ఉన్న కాకా హోటల్లో సాధారణ వ్యక్తిలా టీ తాగారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కార్యకర్తలతో కలిసి టీ స్నాక్స్ తీసుకుంటూ సరదాగా గడిపారు.
వీబీ జీ రామ్ జీని తక్షణమే రద్దు చేయాలి
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ వీబీ జీ రామ్ జీని తక్షణం రద్దు చేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. గురువారం మద్నూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం ద్వారా మోదీకి ఉన్న స్వార్థ బుద్ధి స్పష్టమవుతుందన్నారు. మొదటి నుంచి ప్రధాని మోదీకి ఈ పథకం ఇష్టం లేదని, అందుకే దశల వారీగా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో ప్రతి కుటుంబానికి వంద రోజుల పని హక్కు ఉండేదని, ప్రస్తుతం మార్పుల కారణంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి నిధులు కేటాయించినప్పుడే పని లభించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీసే తిరోగమన చర్య అని తెలిపారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఆశయాన్ని కాలరాస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేదని ప్రస్తుతం పేరు మార్పు చేసి నిధుల్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని, ఇది దేశానికి మంచిది కాదన్నారు. అనంతరం గ్రామ శివారులో ఉపాధి కూలీలతో పలుగు పట్టి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి పని చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, స్థానిక కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
