
- బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తున్నది: అక్బరుద్దీన్ ఒవైసీ
- హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అర్హులకే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హుల కారణంగా అర్హులైనవారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సలహాలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. ‘‘ఖరీదైన బంగ్లా, కారు ఉన్న ఓ స్టూడెంట్‌కు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంది. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. అర్హులకే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను విస్మరించింది. అదేబాటలో ఇప్పుడున్న ప్రభుత్వం నడుస్తున్నది.
కొన్నేండ్లుగా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్ల స్కాలర్ షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం మైనార్టీలకు తోఫాలు ఇస్తే.. ఈ ప్రభుత్వం ఇఫ్తార్ విందుతోనే సరిపెట్టింది’’అని ఒవైసీ అన్నారు. పెండింగ్ లో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్, ఫూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ మంజూరు చేయాలని కోరారు. 7 నెలలుగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అద్దెలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. సభలో బొంగు కర్రల కథ చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనా తీరును ఎండగట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ కూడా హామీల అమలుపై మాయమాటలు చెప్తున్నదని విమర్శించారు. అన్ని జిల్లాల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందులో నీట్, ఐఐటీ కోచింగ్ ఇవ్వాలన్నారు. వక్ఫ్ భూముల వివాదంపై సీబీసీఐడీ విచారణ రిపోర్టు ఏమైందో కూడా తెలియదని చెప్పారు. కరోనా కారణంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని, వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు.