శ్రీశైలంలో ప్రమాదం జరిగి ఏడాదైనా రిపేర్లు చేయలే

శ్రీశైలంలో ప్రమాదం జరిగి ఏడాదైనా రిపేర్లు చేయలే
  • జల విద్యుత్ కేంద్రంలో ఏం జరిగిందో ఇప్పటికీ తేల్చలే
  • ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ నివేదిక, సీఐడీ దర్యాప్తు ఏమైందో..
  • గుట్టుచప్పుడు కాకుండా బుట్ట దాఖలు చేశారని అనుమానాలు
  • నాడు ఘటనే బయటకు రాకుండా ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి ఇయ్యాల్టికి ఏడాదైంది. కానీ ఇప్పటిదాకా యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది తేలలేదు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఏం తేల్చిందో తెలియదు.. జెన్‌‌‌‌కో వేసిన ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ కమిటీ రిపోర్టు ఏమైందో తెలియదు. ప్రమాదం జరిగిన నాలుగో యూనిట్ ఇన్నాళ్లయినా రిపేర్ కాలేదు. వేల కోట్ల నష్టం జరిగినా, ఉద్యోగుల ప్రాణాలు పోయినా.. అసలు విషయం మాత్రం బయటికి రాలేదు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా బుట్టదాఖలు చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
రిపోర్టులెక్కడ?
2020 ఆగస్టు 20లో శ్రీశైలం లెఫ్ట్ హైడల్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 9 మంది ఇంజనీర్లు, సిబ్బంది చనిపోగా.. రూ.3 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించింది. అదే రోజున జెన్‌‌‌‌‌‌‌‌ కో సీఎండీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు, టీఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో జేఎండీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు, మరో ముగ్గురు డైరెక్టర్లతో ప్రత్యేక టెక్నికల్‌‌‌‌‌‌‌‌ కమిటీని వేసింది. డీజీ గోవింద్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సీఐడీ దర్యాప్తు చేసింది. ప్రమాదం ఎందుకు జరిగిందనేది తేల్చాల్సిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ రిపోర్టు, దర్యాప్తు చేసిన సీఐడీ నివేదిక.. రెండు బయటకు రాలేదు. ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు రోజుల పాటు శ్రీశైలంలో ఉండి దర్యాప్తు చేసింది. 11 నెలలు దాటినా అది ఏమైందో బయటికి రాలేదు. సీఐడీ, ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీల రిపోర్టులు వేర్వేరుగా వస్తే సమస్య అని, అందుకే అసలు నివేదికలే బయటకు రానివ్వలేదని సమాచారం.
అంతా రహస్యమే
శ్రీశైలం పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ప్రమాదంపై విద్యుత్‌‌‌‌‌‌‌‌ వర్గాలు గప్‌‌‌‌‌‌‌‌చుప్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాయి. ఘటన గురించిన సమాచారం బయటికి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఒకవేళ ప్రమాదం జరిగిన వీడియోలు బయటికి రాకుంటే.. అసలు ప్రమాదం విషయమే తెలియకుండా చేయాలనే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 2020 ఆగస్టు 20 రాత్రి ప్రమాదం జరిగినప్పుడు సమాచారం అందుకున్న సీఎండీ.. రెస్క్యూ బృందాలకు సమాచారం అందించకుండా మంత్రితో కలిసి స్వయంగా వెళ్లడం ఈ వాదనలకు బలం చేకూర్చాయి. మంత్రి, సీఎండీ 21న తెల్లవారుజామునే చేరుకోగా, రెస్క్యూ బృందాలు మాత్రం మధ్యాహ్నానికి చేరుకున్నాయి. తర్వాత విద్యుత్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ప్రైవేటు సిబ్బంది రిపేర్‌‌‌‌‌‌‌‌ చేసే సమయంలో షార్ట్‌‌‌‌‌‌‌‌ సర్య్యూట్‌‌‌‌‌‌‌‌ జరిగితే.. అది మాక్‌‌‌‌‌‌‌‌ డ్రిల్‌‌‌‌‌‌‌‌ అని కప్పిపుచ్చారనే విమర్శ ఉంది. సొంత సిబ్బంది ఉన్నప్పుడు చేయాల్సిన మాక్‌‌‌‌‌‌‌‌ డ్రిల్‌‌‌‌‌‌‌‌.. ప్రైవేటు సిబ్బంది ఉన్నప్పుడు ఎలా చేస్తారనే అనుమానాలు తలెత్తాయి. ఘటనకు కారణం ఏందనేది తేల్చాల్సిన ఉన్నతాధికారులు.. ప్రమాదం జరుగుతున్నప్పుడు తీసిన వీడియోలు బయటికి ఎందుకు వచ్చాయనే దానిపైనే ఎక్కువగా సీరియస్ అయినట్లు సమాచారం.
రూ.3 వేల కోట్ల నష్టం
ఆగస్టులో భారీగా పవర్ జనరేషన్ చేసే టైమ్​లో పవర్​ప్లాంట్​లో ప్రమాదం జరిగింది. ఒక యూనిట్ పూర్తిగా దెబ్బతినగా, మిగతా యూనిట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొంత భాగం దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడానికి ఆరు నెలలకు పైగా పట్టింది. పూర్తిస్థాయిలో దెబ్బతిన్న 4వ యూనిట్ ఇంకా రిపేర్ కాలేదు. ప్లాంట్ దెబ్బతినడం వల్ల దాదాపు రూ.3 వేల కోట్ల దాకా నష్టం జరిగిందని అంచనాలు ఉన్నాయి. ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాక, జల విద్యుత్ ఉత్పత్తి జరగక ప్రత్యామ్నాయంగా కరెంటు కొనుగోళ్లు చేపట్టడంతో భారీగా నష్టం జరిగింది. 15 రోజుల్లో విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని జెన్‌‌‌‌‌‌‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు ప్రకటించినా.. 4వ యూనిట్‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరణ ఇంకా పూర్తి కాలేదు.