అట్లుంటది మనతో పెట్టుకుంటే: భారతీయుడి దెబ్బకు టెన్నిస్ మ్యాచ్ వాయిదా

అట్లుంటది మనతో పెట్టుకుంటే: భారతీయుడి దెబ్బకు టెన్నిస్ మ్యాచ్ వాయిదా

డబ్బుపై మక్కువతోనే భారతీయులు విదేశాలకు వెళ్తుంటారన్నది సమాజంలో ఉన్న భావన. కానీ అది తప్పని నిరూపించాడు.. ఓ భారత పౌరుడు. విదేశీ గడ్డపై వందలాది ప్రేక్షకుల నడుమ వాతావ‌ర‌ణ మార్పుల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. ఓ ద‌శ‌లో షూ విప్పేసి.. పాద‌ర‌క్ష‌లు లేకుండానే కుర్చీలపై కూర్చొని నిర‌స‌న చేప‌ట్టారు. చుట్టూ ఉన్న వారు తనను వ్యతిరేకిస్తున్నా.. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసినా.. ఏమాత్రం బిడియం లేకుండా సమాజం కోసం పోరాడారు. చివరకు మన భారతీయుడి దెబ్బకు ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్‌ను 50 నిమిషాల పాటు వాయిదా వేశారు.

ఏం జరిగిందంటే..?

యూఎస్ ఓపెన్ మ‌హిళల సెమీ ఫైన‌ల్ మ్యాచ్ స‌మ‌యంలో.. భార‌తీయ వ్య‌క్తి స‌య‌క్ ముకోపాధ్యాయ వాతావ‌ర‌ణ మార్పుల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. అత‌నితో పాటు మ‌రో ముగ్గురు కూడా నిర‌స‌న‌లో పాల్గొన్నారు. నో టెన్నిస్ ఆన్ డెడ్ ప్లానెట్‌, ఎండ్ ఫాజిల్ ఫ్యుయ‌ల్స్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మ్యాచ్‌ను దాదాపు 50 నిమిషాల పాటు నిలిపివేశారు. సెప్టెంబరు 7న అమెరిక‌న్ ప్లేయ‌ర్ కోకో గాఫ్‌, చెక్ స్టార్ క‌రోలినా ముచోవా మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

ఒకానొక సమయంలో షూ విప్పేసిన ముకోపాధ్యాయ‌.. పాదాలను నేలకు అతుక్కునేలా గమ్ చల్లారు. దీంతో అతని పాదాలను నేల నుండి వేరుచేయడం పోలీసులకు కష్టమైంది. ఈ ఘటనలో అతన్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్ ఎమ‌ర్జెన్సీ శాఖ అధికారులు.. కోర్టు ముందు హాజ‌రుకావాలంటూ నోటీసు ఇచ్చి ఆయ‌న్ను విడుదల చేశారు.

ముకోపాధ్యాయ స్వస్థలం కోల్‌క‌తా. ఆయన 25 ఏళ్ల క్రిత‌మే న్యూయార్క్‌కు త‌ర‌లివెళ్లారు. అయితే వాతావ‌ర‌ణ మార్పుల‌పై అభివృద్ధి చెందిన దేశాలు ఎటువంటి ష‌రతుకు క‌ట్టుబ‌డి ఉండ‌డం లేద‌ని ఆయన ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు విడుద‌ల చేస్తున్న ఉద్గరాల వ‌ల్ల భార‌తీయ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు చెప్పుకొచ్చిన ఆయన.. వాతావ‌ర‌ణ మార్పుల‌పై అవ‌గాహ‌న‌, చైత‌న్యం క‌ల్పించే ఉద్దేశంతో టెన్నిస్ మ్యాచ్‌ను అడ్డుకున్న‌ట్లు  తెలిపారు.