- దారుశిలాజంగా గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి
- విస్తృత పరిశీలన కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన ఆలయ కమిటీ
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రామాలయం ఆవరణలో 5 కోట్ల సంవత్సరాల కిందటి పురాతన రాయిని పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి గుర్తించారు. ఆలయాన్ని పున: నిర్మించాలని ఆలయ కమిటీ, పట్టణ ప్రముఖులు, రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా ఆదివారం ఆలయ నిర్మాణం కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రముఖ వాస్తు శిల్పి, అమరావతి బుద్ధ విహార్ సీఈవో, తెలంగాణ రాష్ట్ర నాగార్జున బుద్ధవనం ప్రాజెక్ట్ మాజీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆలయానికి వచ్చారు.
ఆలయ ప్రాంగణంలోని ఒక పురాతన రాయిని పరిశీలించి, ఆ రాయికి సుమారు ఐదు కోట్ల సంవత్సరాల వయసు ఉంటుందని, దానిని దారుశిలజం అంటారని తెలిపారు. అతి పురాతనమైన ఈ రాయిని విస్తృత పరిశీలన కోసం హైదరాబాద్కు పంపిస్తున్నట్లు చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన మధిర రైల్వే రామలయం వద్ద ఐదు కోట్ల సంవత్సరాల వయసు కలిగిన రాయి కనిపించడం పట్ల ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కోనా జనార్దన్ రావు, మల్లాది వాసు, సూరంశెట్టి కిశోర్, మిరియాల వెంకటరమణ గుప్తా, పాటిబండ్ల సత్యంబాబు, కటికల సీతారాం రెడ్డి, కర్నాటి రామారావు, భాను ప్రకాశ్ పాల్గొన్నారు.
