తిరుపతిలో పిల్లల గుండె చికిత్సల ఆస్పత్రి ప్రారంభం

తిరుపతిలో పిల్లల గుండె చికిత్సల ఆస్పత్రి ప్రారంభం

తిరుపతి: బ‌ర్డ్ ఆసుప‌త్రి  ప్రాంగ‌ణంలో టీటీడీ ఏర్పాటు చేసిన‌ శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. మొదటి దశలో రూ.25 కోట్ల ఖర్చుతో 44,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇందులో ఓపి బ్లాక్‌లో 5 కన్సల్టేషన్‌ గదులు, రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.

రేడియాలజీ బ్లాక్‌లో ఎక్సరే రూమ్‌, క్యాథ్‌ ల్యాబ్‌, మరుగుదొడ్లతోపాటు రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు జ‌రిగాయి. 15 పడకలతో ప్రి ఐసియు బ్లాక్‌, 15 పడకలతో పోస్ట్‌ ఐసియు బ్లాక్‌, మూడు ఆపరేషన్‌ థియేటర్లు, 20 పడకలతో రెండు జనరల్‌ వార్డులు, మరుగుదొడ్లు ఉన్నాయి. పరిపాలనా విభాగంలో కార్యాలయం, డాక్టర్ల గదులు, డైరెక్టర్‌ ఛాంబర్‌, సమావేశ మందిరం, మరుగుదొడ్లు నిర్మించారు. ఆసుప‌త్రి ప్రత్యేకతలపై రూపొందించిన 3 నిమిషాల నిడివి గ‌ల వీడియోను సీఎం తిలకించారు. 
ఈ కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, కోడూరు శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జున్ రెడ్డి,  ఎంపిలు డాక్టర్ గురుమూర్తి, మిథున్ రెడ్డి, ఏ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ హరి నారాయణ్, టీటీడీ పాలక మండలి సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్డ్ సీఎస్ ఆర్ ఎం ఓ  శేషశైలేంద్ర, ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.