రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన
  • ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టులాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్

అమరావతి: రాష్ట్రంలో  ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఉద్యమబాట పట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులు తమదైన శైలిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఉమ్మడి నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విధులకు హాజరైన ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన సమయంలో నిరసన నినాదాలు చేశారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల సమిష్టి నిర్ణయంలో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించగా సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో స్కూళ్లలోనే నిరసనలు కొనసాగించారు. హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా.. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్కూలు ఆవరణలో సమావేశమై ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. 
ప్రభుత్వ పాఠశాలల విభజన, తరలింపులు అడ్డుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేదంతా కూటికి లేని పేద  విద్యార్థులే ఉంటున్నారని.. అందుకే సమాజంలోని అన్ని వర్గాల వారు, మేధావులు, చదువుకున్న వారంతా ప్రభుత్వ పాఠశాలల కొనసాగింపు కోసం తాము చేస్తున్న నిరసనలకు సంఘీభావం, మద్దతు ప్రకటించాలని వారు కోరారు. విభజన, తరలింపులను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్బంగా ఉపాద్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యావిధానం అమలు పేరుతో ఏపీ ప్రభుత్వం విద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు నిర్ణయిస్తే స్వాగతించామని, అయితే ప్రభుత్వం ఏకపక్షంగా 172 జీవో ద్వారా పాఠశాలల విభజనకు పూనుకుందని.. ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రెండు మాధ్యమాల స్థానంలో ఏదో ఒక మాధ్యమం మాత్రమే ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొనడం గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. 
సాయంత్రం స్కూళ్లు అయిపోయాక ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. ఉన్నత పాఠశాలల్లో రెండు మాద్యమాలు కొనసాగించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక (ఫ్యాప్టో) ద్వారా వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. గత జూన్ నెల 17న విద్యాశాఖ మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం మాట్లాడిన 40 సంఘాలలో 38 సంఘాలు వ్యతిరేకించినా ప్రభుత్వం ముందుకే వెళ్లాలని నిర్ణయించడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయనే ఆశ కల్పించి ఏదోవిధంగా ప్రభుత్వం తమ విధానాలు అమలు చేయాలని ప్రయత్నించడం మానుకోవాలని కోరారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం పోస్టులను తగ్గించడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం పేరుతో పోస్టుల మిగులుబాటు చూపించి 2030 నికి పాఠశాల విద్యను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
3,4 మరియు 5 తరగతుల ను ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలి
రాష్ట్రంలో NEP అమలులో భాగంగా చేపట్టిన సంస్కరణలలో భాగంగా 3, 4 మరియు 5 ప్రాథమిక స్థాయి తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయకుండా ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ప్రధానోపాధ్యాయులపై పని భారం పెంచటాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అందరూ నల్ల్ల బాడ్జ్ లతో నిరసన ప్రదర్శిస్తూ విధులకు హాజరు కమ్మని ఫ్యాప్టో   పిలుపుమేరకు రాయలసీమ ముఖద్వారం.. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కర్నూలు జిల్లా కర్నూలు మండలము లో వసంత నగర్ పాఠశాలలో ఫ్యాప్టో  రాష్ట్ర  కార్యదర్శి కె.ప్రకాష్ రావు నాయకత్వం లో పాఠశాల సిబ్బంది నల్ల బాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సంపత్ కుమార్,జూనియర్ అసిస్టెంట్ వర ప్రసాద్ రెడ్డి, బేబీ సుజాత,  లత, సరిత,  పద్మావతి, మస్తాన్ వలి, నూర్ మహమ్మద్, పుల్లన్న, శ్రీనివాస రెడ్డి, మనోహర్, రమణ తదితర ఉపాధ్యాయులు నిరసనలో పాల్గొని ప్రభుత్వం నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.