ప్రముఖ ఐఫోన్ కంపెనీ ఆపిల్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆపిల్ ఫిట్‌నెస్ & వెల్‌నెస్ సర్వీస్ అయిన ఆపిల్ ఫిట్‌నెస్+ను డిసెంబర్ 15 నుండి ఇండియాతో సహా మరో 27 కొత్త దేశాలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఈ సర్వీస్ ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి 21 దేశాలలో ఉంది.
ఫిట్‌నెస్+లో ఎం ఉంటాయి:
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 49 దేశాల ప్రజలు ఈ సర్వీస్ వాడుకోవచ్చు. ఫిట్‌నెస్+ ద్వారా శక్తి పెంచే వ్యాయామాలు, యోగా, అధిక శక్తితో చేసే వ్యాయామాలు, పైలేట్స్, డ్యాన్స్, సైక్లింగ్, కిక్‌బాక్సింగ్, మెడిటేషన్ సహా మరికొన్ని వ్యాయామాలను యాక్సెస్ చేయవచ్చు. ఈ వ్యాయామ వీడియోలు 5 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉంటాయి. వీటిని ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీలో చూడవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా మీరు ఇష్టపడే వ్యాయామం టైం, ట్రైనర్లు, మ్యూజిక్ సెలక్షన్ మీకోసం ప్రత్యేకంగా ఒక వ్యాయామ టైం టేబుల్ (Schedule)ను ఫిట్‌నెస్+ ఆటోమేటిక్‌గా రెడీ చేస్తుంది.
ధర ఎంతంటే: మన దేశంలో ఆపిల్ ఫిట్‌నెస్+ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.149, సంవత్సరానికి రూ. 999. ఈ సబ్‌స్క్రిప్షన్ ఐదుగురు షేర్ చేసుకోవచ్చు. అయితే కొత్త ఆపిల్ వాచ్, ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఆపిల్ టీవీ కొన్న కస్టమర్‌లకు, అలాగే కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లేదా పవర్‌బీట్స్ ప్రో 2 కొన్నవారికి ఆపిల్ మూడు నెలల ఫిట్‌నెస్+ సర్వీస్ ఫ్రీగా ఇస్తుంది.

