V6 News

షేక్‌అవుట్‌కు సిద్ధమౌతున్న క్విక్ కామర్స్.. వారికి మనుగడ కష్టమే: బ్లింకిట్ సీఈవో

షేక్‌అవుట్‌కు సిద్ధమౌతున్న క్విక్ కామర్స్.. వారికి మనుగడ కష్టమే: బ్లింకిట్ సీఈవో

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే క్విక్ కామర్స్ రంగం చాలా ప్రసిద్ధి చెందింది. భారీ పెట్టుబడులతో వేగంగా దూసుకెళ్లిన ఈ రంగంలో ఇకపై బలమైన ఆర్థిక పునాది ఉన్న కంపెనీలే నిలబడగలవని బ్లింకిట్ సీఈవో ఆల్బిందర్ ధిండ్సా చెప్పారు. బిగ్ క్విక్ కామర్స్ బబుల్ త్వరలోనే పేలిపోబోతున్నట్లు ఆయన హెచ్చరించారు. రేసులో నిలబడలలేని కంపెనీల పతనం తప్పదని అభిప్రాయపడ్డారు. 

గతంలో సాఫ్ట్‌బ్యాంక్, టెమాసెక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. నిధులను కేవలం విస్తరణ కోసం ఖర్చు చేయడం, నష్టాలను భరించడం ఇక సాధ్యం కాదని.. ఫండ్ రైజింగ్ ద్వారా డబ్బు తెచ్చుకుని నష్టాలను కప్పిపుచ్చుకుంటున్న కంపెనీలకు మనుగడ కష్టమేనని ధిండ్సా అన్నారు. బ్లింకిట్ పోటీదారు స్విగ్గీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేట్ల వద్దే షేర్ల విక్రయానికి సిద్ధం అవుతుండగా.. మరో సంస్థ జెప్టో ఐపీవోకి ముందు 450 మిలియన్ డాలర్ల ఫండ్ రైజింగ్ చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  ఆర్థిక అసమతుల్యత ఉన్నప్పుడు, మార్కెట్ కరెక్షన్ చాలా వేగంగా, ఊహించని విధంగా ఉంటుందని ధిండ్సా స్పష్టం చేశారు.

క్విక్ కామర్స్ వ్యాపారంలో బ్లింకిట్ సుదీర్ఘ ప్రయాణానికి ముందంజలో ఉండే అవకాశం ఉందని అనలిస్ట్‌ల సంస్థ బెర్న్‌స్టీన్ సోసియేట్ జనరల్ గ్రూప్ పేర్కొంది. ఎందుకంటే ఈ కంపెనీ వద్ద దాదాపు 2 బిలియన్ డాలర్ల క్యాష్ రిజర్వ్ ఉండటంతో పాటు.. బలమైన యూనిట్ ఎకనామిక్స్ దీనికి ప్రధాన కారణాలుగా చెప్పింది. ఇదే క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ రిటైల్ వంటి దిగ్గజాలు రంగంలోకి రావడంతో పోటీ మరింతగా పెరిగింది. దీనివల్ల బ్లింకిట్ కూడా లాభదాయకత సాధించడానికి మరింత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్లింకిట్ కేవలం 10 నిమిషాల డెలివరీకే పరిమితం కాకుండా, రిఫ్రిజిరేటర్లు, 6,000కు పైగా బుక్ టైటిల్స్ సహా వేలాది వస్తువులను విక్రయిస్తోంది. రిటైల్, క్విక్ కామర్స్ మధ్య తేడా భవిష్యత్తులో తగ్గుతుందని ధిండ్సా భావిస్తున్నారు. ఇదే క్రమంలో బ్లింకిట్ కేవలం పెద్ద నగరాలకు పరిమితం కాకుండా.. చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ కంటే మౌలిక వసతుల లేమి పెద్ద సవాలుగా ఉందని పేర్కొన్నారు. సరైన సప్లై చైన్, డార్క్ స్టోర్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి బ్లింకిట్ కృషి చేస్తోంది. ముఖ్యంగా స్థానిక వెండార్ల ద్వారా పండ్లు, కూరగాయల సేకరణకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ధిండ్సా.

క్విక్ కామర్స్ కంపెనీలు ఎంట్రీ నుంచి వినియోగదారులకు చేరువ అయ్యేందుకు గతంలో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల తాత్కాలికంగా డిమాండ్ పెంపును చూసినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న గుణపాఠాలను బ్లింకిట్ అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కేవలం బిజినెస్ ఎదుగుదల గురించే కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తున్నట్లు బ్లింకిట్ సీఈవో చెబుతున్నారు. సరైన కేటగిరీల ఎంపిక, డిస్కౌంట్లలో మార్పులు రానున్న దశను నిర్వచించవచ్చని ధిండ్సా తెలిపారు. అయితే కరెక్షన్ మాత్రం రావటం పక్కా అది ఎప్పుడు అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు.