V6 News

తెలంగాణ కిచెన్: ఆరోగ్యానికి సిరి..  బూడిద గుమ్మడి..! ఎండాకాలంలో తక్షణ శక్తి కోసం... సింపుల్ రెసిపీస్...

తెలంగాణ కిచెన్: ఆరోగ్యానికి సిరి..  బూడిద గుమ్మడి..! ఎండాకాలంలో తక్షణ శక్తి కోసం... సింపుల్ రెసిపీస్...

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలన్నా, శరీరంలోని మలినాలను బయటకు పంపి తక్షణ శక్తిని పొందాలన్నా ‘బూడిద గుమ్మడి’కి మించినది లేదు. పోషకాల గనిగా పిలిచే ఈ కూరగాయతో కేవలం కూరలే కాదు.. ఎంతో రుచికరమైన మజ్జిగచారు, చలువ చేసే సలాడ్, రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని, రుచిని అందించే బూడిద గుమ్మడి రెసిపీలు మీకోసం..

మజ్జిగచారు

కావాల్సినవి :బూడిద గుమ్మడి కాయ ముక్కలు - అరకిలోఉప్పు, నూనె - సరిపడాపచ్చి కొబ్బరి - ఒక కప్పు పెరుగు - ఒకటిన్నర కప్పు ఆవాలు, పసుపు, కారం - ఒక్కోటి అర టీస్పూన్ పచ్చిమిర్చి, ఎండు మిర్చి - రెండేసి చొప్పున నీళ్లు - రెండు కప్పులు మెంతులు - పావు టీస్పూన్ కరివేపాకు - కొంచెం

తయారీ : బూడిద గుమ్మడి కాయ ముక్కల్ని నీళ్లతో కడిగి, ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. అందులో పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు వేసి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. పచ్చికొబ్బరి తురుమును మిక్సీజార్​లో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో పెరుగు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దీన్ని గుమ్మడికాయల మిశ్రమంలో పోసి కలపాలి. మరోపాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తాలింపును రెడీ చేసుకున్న మజ్జిగచారులో కలపాలి. 

సలాడ్

కావాల్సినవి : బూడిద గుమ్మడి కాయ - అర కిలో మిరియాల పొడి - అర టీస్పూన్ ఉప్పు - సరిపడా,  దానిమ్మ గింజలు - అరకప్పు పెరుగు - పావులీటరు

తయారీ : బూడిద గుమ్మడికాయను తురమాలి. ఆ తురుమును నీరు లేకుండా వడకట్టాలి. తర్వాత దాన్ని గిన్నెలో వేసి అందులో మిరియాల పొడి, ఉప్పు, దానిమ్మ గింజలు, పెరుగు వేయాలి. అవన్నీ కలిసేలా బాగా కలపాలి. అవసరమైతే.. రుచికోసం తాళింపు వేసుకోవచ్చు. ఈ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. 

డ్రింక్

కావాల్సినవి : బూడిద గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు నిమ్మరసం - ఒక టీస్పూన్ పుదీనా - కొంచెం ఉప్పు, నీళ్లు - సరిపడా

తయారీ : బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి నీళ్లు సపరేట్ చేయాలి. ఆ నీళ్లలో ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. పుదీనా చల్లాలి.