IND vs AUS: హర్షిత్ రానాకు నాలుగు వికెట్లు.. సిడ్నీ వన్డేలో తక్కువ స్కోర్‌కే ఆస్ట్రేలియా ఆలౌట్

IND vs AUS: హర్షిత్ రానాకు నాలుగు వికెట్లు.. సిడ్నీ వన్డేలో తక్కువ స్కోర్‌కే ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బౌలర్లందరూ సమిష్టిగా రాణించి ఆతిధ్య ఆస్ట్రేలియాను ఒక మాదిరి స్కోర్ కే కట్టడి చేశారు. సిడ్నీ వేదికగా శనివారం (అక్టోబర్ 25) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. 56 పరుగులు చేసిన మాట్ రెన్షా టాప్ స్కోరర్ గా  నిలిచాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), షార్ట్ (30), ట్రావిస్ హెడ్ (29) రాణించారు. ఇండియా బౌలర్లలో హర్షిత్ రానా నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ రెండు.. అక్షర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆసీస్ కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభం ఇచ్చారు. భారత బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. తొలి వికెట్ కు 61 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరిన బంతిని ఆడిన హెడ్ పాయింట్ లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే మార్ష్ ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన రెన్షాను సుందర్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు.  

124 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్యారీ, షార్ట్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. నాలుగో వికెట్ కు 59 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. అయితే శ్రేయాస్ అయ్యర్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ కు క్యారీ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి ఆసీస్ వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. నాథన్ ఎల్లిస్ (16), కూపర్ కొన్నోల్లీ (23) సహకారంతో ఆస్ట్రేలియా 230 పరుగుల మార్క్ అందుకుంది. మరో నాలుగు ఓవర్ల ఆట ఉన్నపటికీ 46 ఓవర్లో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ ను ముగించాడు.