
- మూడో పెండ్లికి సిద్ధమవుతుండగా గుండెపోటుతో ఆస్పత్రిపాలు..
- లంగర్ హౌస్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు
మెహిదీపట్నం, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి దయ్యం పట్టిందని చెప్పి.. తాను పెండ్లి చేసుకొని బాగు చేస్తానంటూ మూడో పెండ్లికి సిద్ధమైన 55 ఏళ్ల దొంగబాబా బండారం బట్టబయలైంది. భూత వైద్యం పేరుతో అతడు మోసాలకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న యువతి బంధువులు లంగర్ హౌస్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. లంగర్ హౌస్ ఏరియాకు చెందిన యువతి(18) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడేండ్ల కిందట ఆమె కుటుంబసభ్యులు నెల్లూరు జిల్లా రహమతాబాద్ దర్గాలో ఉండే హఫీజ్ బాబా(55) దగ్గరికి తీసుకెళ్లారు. అతడు హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్ లోనూ రూమ్ రెంట్ కు తీసుకొని ఉంటూ భూత వైద్యం పేరుతో జనాలను చీటింగ్ చేస్తున్నాడు.
ఈక్రమంలోనే లంగర్ హౌస్ ఏరియా నుంచి తన వద్దకు తీసుకొచ్చిన యువతికి దయ్యం పట్టిందని చెప్పాడు. అందువల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నాడు. ఆమెను తాను పెండ్లి చేసుకొని దయ్యాన్ని వదిలిస్తానని కుటుంబ సభ్యులను నమ్మించాడు. అందుకు వాళ్లు ఒప్పుకుని శనివారం (ఈ నెల 11న) రాత్రి ఓ ఫంక్షన్ హాల్ లో పెండ్లి వేడుకకు ఏర్పాట్లు చేశారు. అయితే ఫంక్షన్ హాల్‌కు దొంగ బాబా హఫీజ్ రాలేదు. దీంతో యువతి కుటుంబసభ్యులు హఫీజ్ కు ఫోన్ చేశారు. అతడి బంధువులు కాల్ లిఫ్ట్ చేసి హఫీజ్ కు గుండెపోటు వచ్చిందని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తోందని చెప్పారు. దొంగ బాబాకు గతంలోనే రెండు పెండ్లిళ్లు అయ్యానని హఫీజ్ బంధువులు చెప్పడంతో జరిగిన మోసం బయటపడింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి లంగర్ హౌస్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. హఫీజ్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగ బాబాను కాపాడేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. హఫీజ్ పై ఇప్పటికే సిటీలో పలు కేసులున్నట్లు వారు చెబుతున్నారు.