
లింగంపేట, వెలుగు : పర్మల్ల గ్రామ పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ చెప్పారు. బుధవారం పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి పల్లెలో ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ ఆలయాలను నిర్మించారన్నారు. రాష్ట్రంలో 80 శాతం మత్స్యసహకార సొసైటీల్లో ముదిరాజ్లే ఉన్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్లు సత్తాచాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్, లింగంపేట మండలాధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.