కేసీఆర్​పై న్యాయ పోరాటానికి రెడీ కావాలె

కేసీఆర్​పై న్యాయ పోరాటానికి రెడీ కావాలె

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన సీఎం కేసీఆర్ పై న్యాయ, చట్ట పరమైన చర్యల కోసం బీజేపీ లీగల్ సెల్ ఫైట్ చేయాలని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సూచించారు. టీఆర్ఎస్​ సర్కార్ లో జరుగుతున్న అవినీతి బయటకు రావద్దనే ఉద్దేశంతోనే ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కామెంట్లు చేశారని ఆరోపించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు, సీనియర్ అడ్వొకేట్లతో సంజయ్ సమావేశమయ్యారు. ‘‘రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు, సీఎంగా అదే రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలి. రాజ్యాంగాన్ని తిరిగిరాయలని అనడంతో ఆయనలో ఉన్న అహంకారం బయటపడింది” అని సంజయ్​ మండిపడ్డారు. కేసీఆర్ చేసిన కామెంట్లపై మేధావులు సరైన రీతిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. ‘‘కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబమే రాజ్యం ఏలాలనేది కేసీఆర్ కుట్ర. ప్రధాని మోడీపై కూడా అవమానకరంగా మాట్లాడిన ఆయనపై చర్యలకు సిద్ధం కావాలి” అని చెప్పారు. 

రాష్ట్రంలో అన్ని కోర్టుల ముందు దీక్షలు: రాంచందర్​రావు
రాజ్యాంగం విషయంలో కేసీఆర్ మాట్లాడిన తీరుపై న్యాయ పోరాటానికి బీజేపీ సిద్ధమైందని మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత రాంచందర్ రావు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల ముందు బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను దేశ ద్రోహ చర్య కింద బీజేపీ భావిస్తుందని, దాని కిందనే ఆయనపై కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నేత ప్రేమేందర్  రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు విశ్వనాథ్, రవిచందర్, రామారావు, భుజంగరావు, నారాయణ రెడ్డి, రజితా రెడ్డి, ఆంటోని పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

యూనియన్​ దిశగా ఆర్టీసీ కార్మికులు

దోపిడీ చేసి అప్పు కట్టిండు