బండి సంజయ్​కు హైకోర్టు జరిమానా

బండి సంజయ్​కు హైకోర్టు  జరిమానా

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్‌‌ కుమార్‌‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. కరీంనగర్‌‌ ఎమ్మెల్యే,  రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌‌ ఎన్నికను సవాల్‌‌ చేస్తూ బండి పిటిషన్​దాఖలు చేశారు.  విచారణ సందర్భంగా అడ్వొకేట్‌‌ కమిషన్‌‌ ఎదుట ఆయన హాజరుకాకపోవడంతో రూ.50 వేలను సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పార్లమెంట్‌‌ సమావేశాలు ఉన్నాయని, పార్టీ సమావేశాలు ఉన్నాయని పేర్కొంటూ రెండుసార్లు ఆయన క్రాస్‌‌ ఎగ్జామినేషన్‌‌కు హాజరుకాలేదు. ఇప్పుడు అమెరికా వెళ్లిన కారణంగా హాజరుకాలేపోయారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. 

ఇప్పటికే పలుమార్లు హాజరుకాకుండా గడువు కోరారని, ఎన్నికల పిటిషన్‌‌ను ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణ ముగిస్తామని హైకోర్టు చెప్పింది. ఈ నెల 12న బండి సంజయ్‌‌ తిరిగి వస్తారని, క్రాస్‌‌ ఎగ్జామినేషన్‌‌కు హాజరవుతారని న్యాయవాది చెప్పారు. క్రాస్‌‌ ఎగ్జామినేషన్​కు  హాజరుకావాలంటే  సైనిక సంక్షేమ నిధికి ఎంపీ సంజయ్​ రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ సుమలత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.