వానకు తడుస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే స్పందించరా ?

వానకు తడుస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే స్పందించరా ?
  • బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై  కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
  • ఇప్పటికైనా మించిపోలేదు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి: బండి సంజయ్

హైదరాబాద్: గత ఆరు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ఆందోళన చేస్తుంటే స్పందించరా ? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా విద్యార్థులు కనివిని ఎరుగని రీతిలో నిరసన కొనసాగిస్తుంటే.. కేసీఆర్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గాంధేయ పద్ధతిలో విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తుంటే సీఎం కేసీఆర్ పట్టనట్లు వ్యవహరించడం.. కనీసం అధికారులతో సమీక్ష గాని చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. మీ కుమారుడి విదేశీ పర్యటనలకు, వ్యక్తిగత ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తారు గానీ.. ఉన్నత విద్య అభ్యసించాలన్న కోరికతో ఎన్నో ఆశలతో ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులంటే చులకనా అని ప్రశ్నించారు. . 

బండి సంజయ్ లేఖలో ప్రస్తావిస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ బాసరలోని ట్రిపుల్‌ ఐటి సంస్థ. బాసరలోని ట్రిపుల్‌ ఐటి విద్యార్థులు గత ఆరురోజులుగా  వేల మంది విద్యార్థులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. జాతీయపార్టీ ఏర్పాటుపై, పొలిటికల్‌ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి మీకు సమయం ఉంటుంది, కానీ గత 6 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం మీకు సమయం చిక్కదు. మీరు మరో ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారు. గత ఆరు రోజులుగా ఎండకు ఎండి, వానకు తడుస్తూ గాంధేయపద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యలపై కనీసం మీరు అధికారులతో సమీక్ష చేయడం కానీ, ఈ సమస్యసై దృష్టిపెట్టడం కానీ చేయకపోవడం అత్యంత బాధాకరం, మీ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం.

మీ కుమారుడు విదేశీ పర్యటనకు, మీ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారు గానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మీకు నిధులుండవు. మీకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి విద్యార్థులన్నా, వారి సమస్యలన్నా చులకన భావం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. ఈ విషయాన్ని గుర్తు ఉంచుకుని ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు వెంటనే బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. 

రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, అధికారులు బాసరలోని ట్రిపుల్‌ ఐటి విద్యార్థులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా అహంకారపూరితంగా మారుతూ విద్యార్థులను, వారి సమస్యలను అవహేళన చేసేవిధంగా మాట్లాడటంతో సమస్య మరింత జఠిలమైంది. విద్యార్థులు ఒకపక్క తమ న్యాయమైన డిమాండ్లకోసం శాంతియుతంగా గాంధేయపద్ధతిలో ఆందోళన చేస్తుంటే, గోబల్స్‌కు వారసులైన రాష్ట్రమంత్రులు శ్రీ ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీమతి సబితాఇంద్రారెడ్డిగార్లు విదాష్ట్ర్యర్థులతో సమస్య పరిష్కారమైందని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్రప్రభుత్వం దివాళకోరుతనానికి నిదర్శనం. 

ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, మంత్రులు, అధికారులు మైండ్‌ గేమ్‌ ఆడటం మాని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ట్రిపుల్‌ ఐటిలో సమస్యలు పేరుకుపోయాయి. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను తక్షణం పరిష్కారం చేయాల్సిన విద్యాశాఖామంత్రి విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయంటూ అవహేళన చేయడం సమస్యను మరింత జఠిలం చేయడమే. విద్యార్థులు సమస్యలను, వారి డిమాండ్లను సిల్లీగా ఉన్నాయని రాష్ట్రవిద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిగారు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి తెలంగాణశాఖ తరుపున కోరుతున్నాము. 
శాశ్వత విసి నియామకం జరగాలని, విసి క్యాంపస్‌కు అందుబాటులో ఉండాలని, డైరెక్టర్‌, ఫైనాన్స్‌ అధికారులను నియమించాలని విద్యార్థులు కోరడంలో తప్పేముందో రాష్ట్రప్రభుత్వం చెప్పాలి. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం, అదనపు లైబ్రరీ, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కోరడం, యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్వహణను అభివృద్ధి చేయడం, క్రీడల నిర్వహణకు ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుకోరడం అత్యంత న్యాయమైన డిమాండ్లు. విద్యార్థులు కోరుతున్న 12 డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారం చేయదగినవే. 

విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని సాక్ష్యాత్తు విద్యాశాఖామంత్రి ప్రకటించడం, జిల్లా అధికారులు, పోలీసులు ట్రిపుల్‌ ఐటి విద్యార్థులను బెదిరించడం, వారి తల్లిదండ్రులకు కూడా బెదిరింపు హెచ్చరికలు జారీచేయడం గర్హనీయం. ఇప్పటికైనా మంత్రులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను బెదిరించడం మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాము. 


ప్రభుత్వం ఇప్పటికైనా ఎటువంటి బేషజాలకు పోకుండా విద్యార్థులతో చర్చలు జరపాలని  విద్యార్థుల డిమాండ్లపై సావధానంగా చర్చలు జరపకుండా విద్యార్థుల ఆందోళనలకు రాజకీయాలను ఆపాదించడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం. బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశానికి పిలవాలని, అన్ని విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని, ఆందోళన చేస్తునన విద్యార్థులు, వివిధ రాజకీయపక్షాలపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మంత్రులు, అధికారులు, విద్యార్థులను బెదిరింపులకు గురిచేయవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ శాఖ కోరుతోంది’. అని కోరారు.