సిటీ సెంటర్ మాల్ నిర్లక్ష్యం.. తెగిపడ్డ పాప చేతి వేళ్లు

సిటీ సెంటర్ మాల్ నిర్లక్ష్యం.. తెగిపడ్డ పాప చేతి వేళ్లు

హైదరాబాద్ బంజారాహిల్స్‌ లోని సిటీ సెంటర్ మాల్‌లో దారుణం జరిగింది. ప్లే జోన్లో మెషిన్ లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు  యశోద ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు.  

మే 07వ తేదీన ఆదివారం సెలవు కావడంతో పిల్లలతో కలిసి ఇబ్రహీంనగర్‌ కు చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్‌‌కు తన ముగ్గురి పిల్లలను తీసుకొచ్చాడు. 4వ అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అక్కడ తెరిచి ఉన్న ఓ మిషన్‌లో మెహ్వీష్ (3) చేయి పెట్టింది. ప్లేజోన్‌ మెషిన్‌లో పడి చిన్నారి చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. చిన్నారిని వెంటనే కుటుంబసభ్యులు యశోద ఆస్పత్రికి తరలించారు. బాలిక కుడిచేతి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. 

మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే..

ప్లే జోన్ లోని మెషిన్‌లోకి పాప చేయి  పెట్టడంతో మూడు వేళ్లు పూర్తిగా తెగిపోయినట్లు మెహ్వీష్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి మాల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించాడు. సిటీ సెంటర్ మాల్‌ యాజమాన్యంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పాపకు  ప్రమాదం జరిగిన తర్వాత కూడా స్మాష్ జోన్‌లో ఆడుకుంటున్న పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది అందుబాటులోకి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిటీ సెంటర్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.