కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా!

కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా!

బీసీ కులాల గణాంకాలు లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వారి జనాభా దామాషా పద్ధతిలో  అమలుచేయాలని, మిగిలిన స్థానాలన్నిటిని జనరల్ స్థానాలుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు 2022లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  కేంద్ర ప్రభుత్వం 1992/93లో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243ను  చేరుస్తూ స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు పరిపాలనలో ప్రాతినిధ్యం కల్పించాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులాలకు 34 శాతం రిజర్వేషన్లను 1994 నుంచి అమలు చేస్తున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు తీర్పులను అడ్డుగా చెప్పి వర్టికల్ రిజర్వేషన్లు 50% మించకుండా ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో అమలు చేస్తున్నారు.  బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించి అమలుచేశారు. ఫలితంగా  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారుగా 1000కి పైగా సర్పంచ్ సీట్లను బీసీలు కోల్పోయారు. 

రిజర్వేషన్లకు 50శాతం పరిమితి

దేశంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన ఆర్టికల్ 243 చెల్లుబాటును సుప్రీంకోర్టులో 1994లో సవాల్ చేశారు.  సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో  కే.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో ఆర్టికల్ 243 చెల్లుబాటును సమర్థిస్తూ, కొన్ని నిబంధనలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

అందులో ముఖ్యంగా వర్టికల్ రిజర్వేషన్లు అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని పరిమితిని విధించింది. అదే సమయంలో ఎస్సీ,  ఎస్టీ  రిజర్వేషన్లను వారి జనాభా దామాషా పద్ధతిలో అమలు చేయాలని, మిగిలిన శాతంలో మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ 50% రిజర్వేషన్లు దాటకూడదని అదేశించింది.  ఒకవేళ బీసీ రిజర్వేషన్లు వారి జనాభా దామాషా పద్ధతిలో  అమలు చేయాలంటే కచ్చితంగా బీసీ కులాల గణాంకాలు లెక్కించిన తర్వాత మాత్రమే 50% పరిమితి మించి అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. 

బిహార్​లో 75 శాతం రిజర్వేషన్లు

గత సంవత్సరం ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం స్థానిక సంస్థల్లో  27%  ఓబీసీ రిజర్వేషన్లను బీసీ కులాల గణాంకాలు లేకుండా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా అమలుచేసే ప్రయత్నాన్ని లక్నో హైకోర్టు కొట్టివేసింది. దీంతో  ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లక్నో హైకోర్టు తీర్పును  సుప్రీంకోర్టులో  సవాల్ చేసి  తాత్కాలిక ఉపశమనం ద్వారా హైకోర్టు తీర్పుపై స్టే తీసుకొని గత సంవత్సరం 27%  ఓబీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసింది.  అందుకే దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ 
రిజర్వేషన్లను విద్యా, ప్రభుత్వ ఉద్యోగ, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా పద్ధతిలో న్యాయ వివాదాలు లేకుండా అమలు చేయాలంటే కులగణన ఒక్కటే మార్గం.  దీన్ని గుర్తించిన బిహార్  రాష్ట్ర ప్రభుత్వం కులగణనను అధికారికంగా చేపట్టింది.  ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్లను  విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ 15 నుంచి 20 శాతానికి, ఎస్టీ 1 నుంచి 2 శాతానికి, ఓబీసీ 12 నుంచి 18 శాతానికి, ఎంబీసీ 18 నుంచి 25 శాతానికి పెంచి మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (ఓబీసీ, ఎంబీసీ) రిజర్వేషన్లను 46 నుంచి 65 శాతానికి పెంచి అదనంగా ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం అమలుచేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. అదేబాటలో ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కులగణనను చేపట్టి పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

బీసీ గణాంకాలు అధికారికంగా చేపట్టాలి

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 3 మార్చి 2024న  జీవో నెం.26ను జారీ చేస్తూ, రాష్ట్రంలో  కులగణనకు శ్రీకారం చుట్టింది. ఇంతలోనే  లోక్​సభ ఎన్నికల దరిమిలా ప్రక్రియను మొదలుపెట్టలేదు. ఇప్పటికే  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  కులగణన చేసి ఓబీసీ కులాలకు న్యాయం చేస్తామని ప్రకటించింది.  రాష్ట్రంలో కులగణన చేసి కులాల గణాంకాలను అధికారికంగా ప్రకటించి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిలో పెంచాలి.

విద్య, ఉద్యోగాల్లో ఏవిధంగా అయితే వర్గీకరణ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయాలి. బీసీ జాబితాలోని సంచార, అర్ధ సంచార,  నిమ్న,  విముక్త జాతులు,  ఇతర కులాలు, ముస్లింవర్గాల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ ప్రభుత్వం హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనను జారీ చేసినట్లయితే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. జరగబోయే  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ గణాంకాలు అధికారికంగా చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని హైకోర్టు తప్పుబట్టి.. సుప్రీంకోర్టు ఆదేశానుసారం బీసీ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించే ప్రమాదం ఉంది.

- కోడెపాక కుమారస్వామి రాష్ట్ర అధ్యక్షుడు,
తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం