బెంగళూరులోని ఒక మెడికల్ కాలేజీలో వింత ఘటన జరిగింది. పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్, క్లాస్ జరుగుతుండగానే ఒక ఎంబిబిఎస్ విద్యార్థినికి 'ఐ లవ్ యూ' చెప్పాడు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీలో పెద్ద గొడవ జరిగింది.
ఎం జరిగిందంటే...నెలామంగళ దగ్గరున్న 'శ్రీ సిద్ధార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'లో అబ్దుల్ రెహమాన్ షరీఫ్ అనే ప్రొఫెసర్ మైక్రోబయాలజీ క్లాసులు చెబుతుంటారు. మార్చి 25న క్లాస్ తీసుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా ఆగిపోయి.. "మీ బ్యాచ్ చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, మీలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పాడు. వెంటనే ఆ విద్యార్థిని దగ్గరకు వెళ్లి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పి, క్లాసులో చాక్లెట్లు పంచమని మిగతా విద్యార్థులకు చెప్పాడు.
దీనిపై ఆ విద్యార్థిని తీవ్రంగా మండిపడుతూ అభ్యంతరం తెలిపింది. నేను నీకు నచ్చకపోతే ప్రిన్సిపాల్‌కు చెప్పుకో అని ప్రొఫెసర్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ అమ్మాయికి కూడా తనపై ఇష్టం ఉందని, అందుకు సిసిటివి ఆధారాలు ఉన్నాయని ప్రిన్సిపాల్ ని నమ్మించడానికి ప్రొఫెసర్ ప్రయత్నించాడు. దీంతో ఆ అమ్మాయి చెప్పుతో ప్రొఫెసర్‌ను కొట్టగా, మరికొందరు విద్యార్థులు కూడా ప్రొఫెసర్ పై దాడి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దింతో చివరికి కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రొఫెసర్ ప్రవర్తన బాలేదని గతంలోనే ఫిర్యాదులు రావడంతో, ఆయనను కాలేజీలోకి రావద్దని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. ఆ ఆదేశాలను పట్టించుకోకుండా మార్చి 23న ఆయన క్యాంపస్‌లోకి వచ్చి విద్యార్థిని చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు ప్రొఫెసర్‌ను విచారణకు పిలవగా... ఆయనపై ఉన్న కేసులు అన్ని 7 ఏళ్లలోపు శిక్ష పడేవి ఉండటంతో, ప్రస్తుతానికి కేవలం నోటీసులు ఇచ్చి పంపించేశారు కానీ అరెస్ట్ చేయలేదు. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి విద్యార్థిని పట్ల ఇలా ప్రవర్తించడంపై తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
