మహిళలు కెరీర్ నిర్మించుకోవడానికి, ప్రశాంతంగా జీవించడానికి బెంగళూరు నంబర్ వన్ నగరంగా మారుతోందని బుధవారం ఒక కొత్త అధ్యయనం కనిపెట్టింది. వర్క్‌ప్లేస్ కల్చర్ కన్సల్టెన్సీ అవతార్ గ్రూప్ నిర్వహించిన టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అధ్యయనం ప్రకారం, మహిళా నిపుణులకు బెంగళూరు దేశంలోనే అగ్రగామి నగరంగా అవతరించింది. టాప్ 10లో చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్, కోల్‌కతా, అహ్మదాబాద్, తిరువనంతపురం తరువాత కోయంబత్తూర్ ఉన్నాయి.
పరిశోధకులు దేశంలోని 125 నగరాలను పరిశీలించి ముఖ్యంగా కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇచ్చారు. మహిళలకు ఆ నగరంలో ఎంతవరకు రక్షణ ఉంది ? జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అక్కడ మహిళల సాధికారత ఎలా ఉందనేది మొదట చూశారు. తరువాత ఆఫీసుల్లో వాతావరణం, మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? కంపెనీలు వారికి ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయి? కెరీర్‌లో ఎదగడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది లెక్కించారు.
2025లో బెంగళూరు 53.29 స్కోరుతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. బలమైన వృత్తిపరమైన పర్యావరణ వ్యవస్థ, మహిళలకు కెరీర్ అవకాశాలు దీనికి ప్రధాన కారణం. చెన్నై 49.86 స్కోరుతో తర్వాతి స్థానంలో ఉండగా, పూణే (46.27), హైదరాబాద్ (46.04), ముంబై (44.49) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా వంటి నగరాలు ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి పరంగా మంచి పనితీరు కనబరిచినప్పటికీ భద్రత, జీవన వ్యయం వంటి సామాజిక అంశాలపై తక్కువ స్కోరు సాధించాయని అధ్యయనం ఎత్తి చూపింది.. తిరువనంతపురం, సిమ్లా, తిరుచిరాపల్లి వంటి నగరాలు ఉండడానికి, భద్రతకు చాలా బాగున్నాయి, కానీ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చివరికి మహిళలు స్వేచ్ఛగా పని చేస్తూ ఎదగడానికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఉత్తమమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
