నాటు వైద్యం, క్షద్రపూజలతో ప్రాణహాని ఉందని భయపెట్టి బంగారం, డబ్బు మోసం

నాటు వైద్యం, క్షద్రపూజలతో ప్రాణహాని ఉందని భయపెట్టి బంగారం, డబ్బు మోసం
  • ప్రాణహాని ఉందని భయపెట్టి బంగారం, డబ్బు కొట్టేస్తున్న వ్యక్తి అరెస్టు 

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడలో  నాటు వైద్యం, క్షుద్రపూజల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న కోన వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  టూ టౌన్ సీఐ సోమ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఘటికల్ గ్రామానికి చెందిన వినోద్ క్షుద్ర పూజలు, నాదు వైద్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతని వద్దకు గోవింద్, అడావత్ శిరీష నాటు వైద్యం కోసం రాగా వారి బలహీనతను దృష్టిలో పెట్టుకుని గోవింద్‌కు ప్రాణహాని ఉందని భయపెట్టాడు.  

వారి నుంచి 5.7 తులాల బంగారం, రూ.13,200 నగదు ముడుపు పేరుతో తీసుకుని నకిలీ బంగారం పెట్టి మోసం చేశాడు. 41 రోజుల తర్వాత ముడుపు విప్పి చూడగా అందులో నకిలీ బంగారం ఉంది. దీంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన  డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

 ఇదే విధంగా సూర్యాపేట, నూతనకల్, నకిరేకల్, మేళ్లచెరువు ప్రాంతాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ప్రజలు మూఢనమ్మకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఎస్‌ఐ రాంబాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించినట్లు తెలిపారు.