పెబ్బేరు సంత స్థలంపై కాంగ్రెస్ దోపిడీకి కుట్ర చేస్తోంది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పెబ్బేరు సంత స్థలంపై కాంగ్రెస్ దోపిడీకి కుట్ర చేస్తోంది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పెబ్బేరు, వెలుగు :  పెబ్బేరు సంత స్థలం భూసేకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచేయడానికి కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం పెబ్బేరులో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. గత మూడు దశాబ్దాలుగా కోర్టు వివాదంలో ఉన్న సర్వే నంబర్ 392 భూమి విషయంలో 2003, 2007, 2022లో వరుసగా భూయజమానులకే అనుకూలంగా తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. 

గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ప్రజల ప్రయోజనాల కోసం భూయజమానులను ఒప్పించి, 16 ఎకరాల సంత స్థలానికి ప్రతిగా ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేలా గిఫ్ట్ డీడ్ ఇప్పించామని, కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం తనపై కబ్జాకోరు అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ నెల 20న హైకోర్టు సదరు 30.19 ఎకరాల భూమి యజమానులదేనని తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుల అబద్ధాలు బయటపడ్డాయని విమర్శించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, భూయజమానులకు ఓఆర్ఆర్ సమీపంలో విలువైన భూమి ఇప్పిస్తామని నమ్మబలికి, అందులో సగం వాటా ముఖ్యమంత్రి సోదరుడికి ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటూ వేల కోట్ల దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. తనపై అసత్య ప్రచారాలు చేసిన వారు తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.