నెలవారీ ఆదాయానికి బెస్ట్​ స్కీమ్.. పోస్ట్​ ఆఫీస్​ ఎంఐఎస్​

నెలవారీ ఆదాయానికి బెస్ట్​ స్కీమ్.. పోస్ట్​ ఆఫీస్​ ఎంఐఎస్​

న్యూఢిల్లీ: తక్కువ ప్రీమియంతో నెల లెక్కన ఆకర్షణీయమైన ఆదాయం రావాలని అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌‌కమ్ స్కీమ్‌ (ఎంఐఎస్‌) ఎంతో బాగుంటుంది. ఇది పూర్తిగా డెట్​స్కీమ్.  అంతేగాక ప్రభుత్వ సంస్థ నిర్వహించే పథకం కాబట్టి రిస్కు ఉండదు. నష్టాలు వచ్చే అవకాశాలు లేవు. రిస్క్ లేని  ఆప్షన్‌‌లలో పెట్టుబడి పెట్టాలని కోరుకునేవాళ్లు ఎంఐఎస్​ను తప్పకుండా పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోస్ట్ ఆఫీస్ నేషనల్ మంత్లీ ఇన్‌‌కమ్ స్కీమ్  సహా చిన్న పొదుపు పథకాలకు రేట్లను ప్రకటించింది.   వడ్డీరేట్లను 6.6 శాతం వద్ద  ఎప్పట్లాగే ఉంచింది. ఈ లెక్కన చూసినా ఇప్పటికీ అనేక బ్యాంక్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ రేట్ల కంటే ఎక్కువ శాతమే!  ఎంఐఎస్​  మార్కెట్‌‌లో అందుబాటులు ఉన్న అత్యుత్తమ చిన్న మొత్తాల పెట్టుబడి పథకాల్లో ఒకటని పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్ పర్టులు చెబుతున్నారు. ఎంఐఎస్​ మొదలుపెట్టినప్పుడు డాక్యుమెంట్లలో పేర్కొన్న ప్రకారం స్థిరమైన రాబడికి హామీ ఇస్తుంది. దీనర్థం  తరువాత వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఇన్వెస్టర్లు వాటి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. 
 

రూ.1,000 నుంచే స్టార్ట్‌..
ఎంఐఎస్​ ఖాతాను తెరవాలనుకునే ఆసక్తిగల పెట్టుబడిదారులు తప్పనిసరిగా అకౌంట్​ తెరవడానికి కనీస మొత్తం రూ. 1,000 అని గుర్తుంచుకోవాలి. పోస్ట్ ఆఫీస్ రూల్స్​ ప్రకారం, ఆ తర్వాత డిపాజిట్లు రూ. 1,000  మల్టిపుల్స్​లో​ ఉండాలి. ఈ రూల్​2020 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. గరిష్ట పెట్టుబడి పరిమితి ఒకే ఖాతాకు రూ. 4.5 లక్షలు కాగా  ఉమ్మడి ఖాతాలకు రూ.9 లక్షలు ఉంటుంది.   ప్రతి జాయింట్ హోల్డర్‌‌కు ప్రతి జాయింట్ ఖాతాలో సమాన వాటా ఉంటుంది.
 

పిల్లలకు పోస్టాఫీసు ఎంఐఎస్​ ఖాతా ఉండవచ్చా?
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్​ ఖాతాను మైనర్ తరపున  గార్డియన్​ తెరవవచ్చు. మైనర్​ వయసు కనీసం పదేళ్లు ఉండాలి. ప్రతి నెలా పొందే వడ్డీతో, తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఫీజులను చెల్లించవచ్చు లేదా వారి  కోసం ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు.
 

వడ్డీ లెక్కింపు ఇలా
మీరు ఒక  ఎంఐఎస్​ ఖాతాను తెరిచి అందులో రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలనుకుంటే, ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు ప్రకారం  ప్రతి నెలా రూ. 1,100 పొందుతారు.  మీరు పిల్లల పేరు మీద రూ. 3.50 లక్షలు పెట్టుబడి పెడితే  రూ. 1,925 వడ్డీ వస్తుంది. మీరు గరిష్టంగా రూ. 4.5 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రతి నెలా రూ. 2,475 వడ్డీ చెల్లిస్తారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంబంధిత పోస్ట్ ఆఫీస్‌‌లో పాస్ బుక్‌‌తో సూచించిన దరఖాస్తు ఇవ్వడం ద్వారా పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్​ ఖాతాను తెరవొచ్చు.  ఐదు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత మూసివేయవచ్చు.