
భద్రాచలం,వెలుగు : పాత పద్దతిలోనే వేతనాలు చెల్లించాలని హాస్టల్ డైలీవేజ్ కార్మికులు డిమాండ్చేశారు. 20 రోజులుగా ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న హాస్టల్ డైలీవేజ్ కార్మికులు సోమవారం మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం పాత పద్దతిలో కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నప్పటికీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం జీతాలు తగ్గించి కార్మికుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు.
దీంతో ప్రతి కార్మికుడు రూ.16 వేలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమశాఖ అధికారులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల మాదిరి పాత పద్దతిలోనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జేఏసీ నాయకులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాచారి, బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.