
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ సూచన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కౌజు పిట్టలు, చేపల పెంపకం, కూరగాయల సాగుతో మహిళలకు అదనపు ఆదాయం లభిస్తోందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కౌజు పిట్టలు, చేపల పెంపకం యూనిట్లతో పాటు కూరగాయల సాగును సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది గుంటల స్థలం కలిగిన ప్రతి మహిళా రైతు కూరగాయల సాగును ప్రారంభించాలన్నారు.
ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఇతరత్రా వివరాలతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రెండు రోజుల్లో ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. కౌజు పిట్టలు, చేపల పెంపకంతో పాటు కూరగాయల సాగు చేస్తున్న మహిళలను ఆయన అభినందించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఎంపీడీలు పాల్గొన్నారు.
21 స్కూల్స్లలో ప్రీ ప్రైమరీ క్లాసెస్
జిల్లాలో 21 స్కూల్స్లలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ జితేశ్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేండ్లు నిండిన పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చేర్పించాలన్నారు. స్కూళ్లలో చేరిన స్టూడెంట్స్కు యూనిఫాం, బుక్స్, క్రీడా పరికరాలు, ఫ్రీగా ఇవ్వనున్నట్టు తెలిపారు. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు.
పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రతి స్కూల్లో కనీసం 20 మంది స్టూడెంట్స్ ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి ప్రీ ప్రైమరీ క్లాసెస్ ప్రారంభించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, ఐసీడీఏఎస్ పీడీ స్వర్ణలత లెనినా పాల్గొన్నారు.