మధ్యప్రదేశ్ బోర్గాం నుంచి భారత్ జోడోయాత్ర

మధ్యప్రదేశ్ బోర్గాం నుంచి భారత్ జోడోయాత్ర

ఖెర్దా(మధ్యప్రదేశ్) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 79వ రోజు మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. బోర్గావ్ నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 7 జిల్లాలో భారత్ జోడోయాత్ర సాగనుంది. రాహుల్ పాదయాత్రలో ఆయన సోదరి ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. 

పాదయాత్రలో ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు. నిన్న తొలిసారి భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రిహాన్ వాద్రా కూడా పాల్గొన్నారు. ఒకేసారి గాంధీ కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొనే సరికి మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ కూడా రాహుల్ తో కలిసి ప్రియాంకగాంధీ పాదయాత్ర చేయనున్నారు. 

మధ్యప్రదేశ్ లో భారీ ఏర్పాట్లు

వచ్చే ఏడాది మధ్యప్రదేశ్​లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు. టికెట్లు ఆశిస్తున్న నేతలతో పాటు అగ్ర నాయకులంతా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఇదే మంచి అవకాశంగా సన్నాహాలు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా ప్రజలు, అభిమానులు రాహుల్ గాంధీకి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసులు రాహుల్ కు భద్రత కల్పించడానికి రోడ్డుకు ఇరువైపులా తాళ్లు అడ్డు పెడుతున్నారు.

6 రాష్ట్రాలలో 1470కిమీ పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాలలో 1470 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గత సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేసుకుని బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది.

రాజస్థాన్ ఎమ్మెల్యే వ్యవహారంపై వివాదం

భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ తలపై రాజస్థాన్ ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నా ముద్దుపై పెట్టిన ఘటనపై వివాదం చెలరేగింది. ఈ  ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసిన బీజేపీ నేత అరుణ్ యాదవ్.. దీనికి క్యాప్షన్ చెప్పాలంటూ నెటిజన్లను కోరారు. అయితే దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దివ్య మడెర్నా. రాహుల్ గాంధీ తన అన్నయ్య, గురువు, సంరక్షుడు అంటూ ఏడు క్యాప్షన్ లు పెట్టి  ట్వీట్ చేసి ఎదురుదాడికి దిగారు. అరుణ్ యాదవ్  ట్వీట్‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.