ఆర్యన్ ఖాన్ కి బాంబే హైకోర్టులో ఊరట

ఆర్యన్ ఖాన్ కి బాంబే హైకోర్టులో ఊరట

ముంబయి: డ్రగ్స్ కేసులో అరెస్టయి కండీషన్ బెయిల్ పై విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ పై విడుదల సందర్భంగా ప్రతి శుక్రవారం ముంబయిలోని ఎన్సీబీ ఆఫీసులో హాజరు కావాలన్న షరతు నుంచి బాంబే హైకోర్టు మినహాయింపునిచ్చింది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ దొరికిన కేసు దర్యాప్తు ఢిల్లీలోని ఎన్సీబీ ఆధ్వర్యంలో ఉన్న సిట్ కు బదీ అయింది. దీంతో ముంబయి ఎన్సీబీ ఆఫీసులో హాజరు కావాలన్న షరతును సడలించాలంటూ ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై బుధవారం బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సాంబ్రే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. షరతులు సడలించాలని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతారని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ తెలుపగా.. ఎన్సీబీ తరపు న్యాయవాది శ్రీరామ్ సిర్షాత్ అభ్యంతరం లేదని ప్రకటించారు. దీంతో ఆర్యన్ ఖాన్ ముంబయి దాటి ఎక్కడికి వెళ్లినా ప్రయాణానికి సంబంధించిన వివరాలు అధికారులకు సమర్పించాలన్న నిబంధనలోనూ స్వల్ప మార్పు చేశారు. ఢిల్లీలోని ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ప్రయాణానికి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని న్యాయమూర్తి స్పష్టం  చేశారు. ఆర్యన్ ఖాన్ హాజరయ్యేందుకు వీలుగా కనీసం 72గంటల సమయం ఇవ్వాలని సూచించారు.