హ్యాట్సాప్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ : ఈ పిల్లోడు పుట్టింది ఫిబ్రవరి 30వ తేదీ

హ్యాట్సాప్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ : ఈ పిల్లోడు పుట్టింది ఫిబ్రవరి 30వ తేదీ

అధికారులు చేసిన తప్పిదానికి కిందిస్థాయి సిబ్బంది.... టీచర్లు చేసిన తప్పిదానికి పిల్లలు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.  ఏదో డిపార్ట్ మెంట్ తప్పులు జరిగాయంటే వారికి అవగాహన లేదులే.. ఏదో జరిగిందిలే అనుకోవచ్చు..  కాని భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో తప్పు జరిగితే .... అసలు మన దేశ విద్యావ్యవస్థ ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్దం చేసుకోవచ్చు.  ఉన్నత చదువులు చదవాలంటే కింది తరగతి స్కూల్లో నుంచి టీసీ.. స్డడీ సర్టిఫికెట్.. ఇలా అనేక రకాలైన ధృవీకరణ పత్రాలు అడుగుతారు.  టీసీని క్షుణ్ణంగా పరిశీలించి జాయిన్ చేసుకుంటారు. ఈ రామాయణం అంతా ఇప్పుడెందుకనుకుంటున్నారా... బీహార్ ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయుడు ఇచ్చిన టీసీలో నమోదు చేసిన పుట్టిన తేది విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..  అసలు ఆయనెలా పాఠాలు బోధిస్తు్న్నాడని కొంతమంది ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్లే....

బీహార్ లో విద్యాశాఖ సరికొత్త ఘనత సాధించింది.  ఓ విద్యార్థికి ఇచ్చిన టీసీ పుట్టిన తేది ఫిబ్రవరి 30 గా నమోదు చేశారు. సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి.  ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలియకపోవడం శోచనీయం అంటూ.. అసలు ఫిబ్రవరి 30  అనేది క్యాలండర్ లేకపోతే ఆరోజు ఎలా జన్మిస్తారని  ప్రజలు చర్చకు లేవనెత్తారు. ఆ స్కూలు హెడ్ మాస్టర్ మాత్రం చిన్నారి టీసీలో అతని పుట్టిన తేదీని ఫిబ్రవరి 30గా పేర్కొనడంతో ... ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 

క్యాలండర్ లో లేని తేదీ  పుట్టిన తేది

బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలోని  చకై బ్లాక్ ప్రాంతంలోని అప్‌గ్రేడ్ చేసిన మిడిల్ స్కూల్ వాజ్‌పైడిహ్‌ స్కూలు నుంచి ఇలాంటి టీసీ బయటకొచ్చింది.  అసంఘటియా మోహన్‌పూర్ నివాసి రాజేష్ యాదవ్ కుమారుడు అమన్ కుమార్  ఈ స్కూల్లో ఎనిమిదవ తరగతి పూర్తి చేశాడు.  ఆ విద్యార్థి పై చదవుకు వేరొక పాఠశాలకు వెళ్లా్ల్సి ఉండగా .. ఆస్కూల్ హెడ్ మాస్టర్ ఆ విద్యార్థికి టీసీ ఇచ్చాడు. కాని ఆ టీసీలో పుట్టిన తేది 30 ఫిబ్రవరి 2009 అని నమోదు చేశారు.  ఫిబ్రవరి నెల 28 లేదా 29 తేదీలతో ముగుస్తుంది. 

ప్రధానోపాద్యాయుడి తప్పిదంతో..

అమన్ కుమార్ టీసీలో పుట్టిన తేది తప్పుగా నమోదు కావడంతో తొమ్మిదవ తరగతిలో ప్రవేశం పొందలేకపోయాడు. తన కుమారుడి పుట్టిన తేదీని సరిచేయాలని చాలసార్లు ఆ పాఠశాల ప్రధానోపాద్యాయుడిని కోరినా... చేయడంలేదని అమన్ తండ్రి రాజేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఎప్పుడు అడిగినా ఏవో కుంటిసాకులు చెబుతూ ప్రధానోపాద్యాయుడు  కాలయాపన చేస్తున్నాడని రాజేష్ తెలిపారు.  తన కుమారుడి టీసీలో హెడ్ మాస్టర్ నమోదు  చేసిన తప్పుడు పుట్టిన తేదీవల్ల నాకుమారుడు చదువుకోలేకపోతున్నాడని తెలిపారు.

చర్యలు తీసుకుంటా: డీఈవో

ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి కపిల్ దేవ్ తివారీని  అడుగగా ఈ విషయం తనకు వాట్సాప్ ద్వారా తెలిసిందని... పాఠశాల ప్రధానోపాద్యాయుడిని వివరణ అడిగామని డీఈవో తెలిపారు.  వివరణ ఇచ్చిన వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో అన్నారు.  ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి తప్పు జరగలేదని, అవగాహనారాహిత్యం వల్లే ఈ తప్పిదం జరిగిందని తెలుస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి  తెలిపారు.  ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చిన దానిని బట్టి పరిశీలిస్తే ఆయన ఆ ఉద్యోగానికి  పనికి రాదని స్పష్టమవుతోందన్నారు.  ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీఈవో తెలిపారు. 

అవగాహన రాహిత్యం

ఇలాంటి టీచర్లు పిల్లలకు పాఠాలు చెబితే... దేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉందో అర్దమవుతుంది.  మిగతా శాఖలు ఎలా ఉన్నా కనీసం విద్యాశాఖలో అయినా నిష్ణాతులను నియమించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు గ్రహించాలి.