
- దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు: రాంచందర్ రావు
- రాష్ట్ర అవసరాలకు మించి కేంద్రం యూరియా ఇచ్చింది
- కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తున్నది
- తాను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తానని సవాల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదాల వెనుక అర్బన్ నక్సల్స్‌తో సహా అనేక శక్తులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఈ నినాదాలకు బలం చేకూర్చుతున్నది తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేశ సమగ్రత, ఐక్యత కోసం పనిచేసే పార్టీ అని ఆయన అన్నారు. ‘‘ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేది చట్టం.
అంతేగానీ ఒకరిని వెళ్లిపోవాలని చెప్పే హక్కు ఇంకొకరికి లేదు. మనమంతా భారతీయులమే. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా నివసించడానికి హక్కు ఉంది’’ అని చెప్పారు. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదాలు మంచివి కావని, ఇలాంటివి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. వీటిని నిరోధించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
యూరియాపై చర్చకు రావాలి..
ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తున్నదని రాంచందర్ రావు ఆరోపించారు. ‘‘కేంద్రం తెలంగాణకు అవసరానికి మించి యూరియా సరఫరా చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ మిస్ మేనేజ్‌మెంట్ వల్ల కృత్రిమ కొరత ఏర్పడింది. యూరియా స్టాక్ లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తప్పుడు ప్రకటనలు చేయడంతో రైతులు ఆందోళనతో క్యూ కట్టారు. రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది.
కొరతకు కారణాలు వేరే ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ లో ఆగస్టు వరకు 8.30 లక్షల టన్నులు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 5.18 లక్షల టన్నులు కేంద్రం సరఫరా చేసింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సొంత జిల్లా ఖమ్మంలో గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో అదనంగా 3,200 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే రాజీనామాకు సిద్ధం. లేదంటే తుమ్మల రాజీనామ చేస్తారా?’’ అని సవాల్ విసిరారు.