
- ఓటర్ల నాడి తెలుసుకునేందుకు కమలం సర్వే
- కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ ఫోకస్
- సైలెంట్ మోడ్‌లో బీఆర్ఎస్
నిజామాబాద్, వెలుగు : స్థానిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా లేదంటే ప్రాదేశిక ఎన్నికలా అన్న సందిగ్ధం నెలకొంది. ప్రకటన వెలువడక ముందే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం నువ్వా..నేనా అన్నట్లు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి ఫోన్ సర్వే మొదలుపెట్టి ఓటర్ల నాడి తెలుసుకుంటోంది. మీ ప్రాంతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజారిటీ వస్తుందని అభిప్రాయాలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ కేడర్ స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది. ఇప్పటికే కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రిజర్వేషన్స్ ఫైనల్ కానప్పటికీ అభ్యర్థులపై లీడర్స్ అంచనాకు వస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ ముందు వరకు పదేండ్లు జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం నడిపిన బీఆర్ఎస్ ఇంకా సైలెంట్‌గా ఉంది.
ఎవరి వ్యూహ్యం వారిదే..
జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులు ఉన్నాయి. 31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. నిజామాబాద్నగర పాలక సంస్థతో పాటు, ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలు 154 డివిజన్/వార్డులు ఉన్నాయి. వీటిలో గ్రామ పంచాయతీల పాలన గతేడాది ఫిబ్రవరిలో ముగిసింది. తరువాత జూలైలో జడ్పీ, ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీ పాలకుల టర్మ్ ముగిసింది. వీటిలో ముందుగా ఎన్నికలు వేటికి జరుగుతాయనే విషయంపై స్పష్టత లేదు. గ్రామ పంచాయతీలకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి.
కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రెండు నెలల గడువు ఉంది. లోకల్ బాడీ ఎన్నికలన్నింటిలో సత్తా చాటాలనే ప్లాన్‌తో కాంగ్రెస్ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, కొత్త రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీ రిలీజ్, స్వయం సహాయ సంఘాలకు గ్రౌండ్లో పెరిగిన యాక్టివిటీస్‌తో కేడర్ హుషారుగా ఉంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని పార్టీ నిర్ణయించడం వారిలో మరింత జోష్ నింపింది. దీంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ప్రజల ఆదరణ ఉన్న నేతలనే బరిలోకి దింపాలని ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యారు. రిజర్వేషన్ ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నలుగురు చొప్పున అభ్యర్థుల పేర్లను సేకరించారు.
ఆగస్టు 2, 3 తేదీల్లో పార్టీ పెద్దలు మీనాక్షీనటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్ పాదయాత్రలు ఉండగా, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగనుంది. ఆ తరువాత నిజామాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సభకు ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ అర్వింద్ జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత విస్తరించాలంటే లోకల్ బాడీలు గెలువాలని భావిస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో డివిజన్ల వారీగా ఇప్పటికే సర్వే ముగించారు. జిల్లాలోని 31 జడ్పీటీసీ స్థానాల్లో యాక్టివ్ నేతలను రంగంలోకి దింపాలని కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రెండు రోజుల నుంచి ఫోన్ సర్వే చేయిస్తున్నారు. మీ ఏరియాలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని ఓటర్ల ద్వారా సేకరిస్తున్నారు.
ఫిరాయింపులపై ఆశ
లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవి ముందు జరుగుతాయనే అంశం పక్కనబెడితే బీఆర్ఎస్ లో నిస్తేజం అలుముకుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేడర్ ఇతర పార్టీల్లో జాయిన్ కావడంతో సెగ్మెంట్ నేతలు ఢీలా పడ్డారు. ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా పార్టీ టికెట్లు దక్కక అలకవహించి ఫిరాయించే వారిపై ఆశలు పెట్టుకున్నారు.