ఈటలతో బలవంతంగా అబద్దాలు చెప్పించారు

ఈటలతో బలవంతంగా అబద్దాలు చెప్పించారు

హైదరాబాద్: కేంద్రంపై మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటెల ఒక్క రోజులొనే మాట మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం చెప్పారని.. అయితే బుధవారం ఏమైందో ఏమో... గురువారం రోజు తన మాటను మార్చారన్నారు. కేంద్రానికి మేము ఆక్సీజన్ కోసం ఎన్నోసార్లు విన్నపాలు చేసినా అడిగినంత ఇవ్వడం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు.  మంత్రి ఈటెల రాజేందర్ తో ఈ ప్రభుత్వ పెద్దలు బలవంతంగా అబద్దాలు చెప్పించారని తెలిపారు వివేక్. ఈ ప్రభత్వం కరోనాను ఎట్లా కంట్రోల్ చేయాలో ఆలోచించడం లేదు కానీ.. కరోనాను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ల బ్లాక్ మార్కెట్ ను ఆపడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని..పైగా అన్నింటికీ కేంద్రంపై నెపంనెట్టి తప్పించుకోవాలని చూస్తోందన్నారు. కరోన విషయంలో కేంద్ర ప్రభుత్వం, స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రతీ క్షణం దేశంలో కరోనాను ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్రజల్ని ఎట్లా కాపాడాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభత్వ ఆసుపత్రుల్లో 161 PSA ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు పీఎం కేర్ నుంచి జనవరి 5వ తేదీన నిధులు కూడా మంజూరు చేశారన్నారు. ఏడాది పాటు ఆ ప్లాంట్ మెయింటెనెన్స్ కు కూడా కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు. 

అందులో భాగంగా తెలంగాణాకు 5 ప్లాంట్స్ ను కేటాయించిందని గుర్తు చేశారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్లాంట్ కూడా ఏర్పాటు చేయలేదని తెలిపింది. మొన్న ప్రధాని అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దేశ వ్యాప్తంగా మరో 500 PSA ఆక్షీజన్ ప్లాంట్స్ మంజూరు చేసింది. విదేశాల నుంచి ఒక లక్ష ఆక్సిజన్ కాంసెంట్రేటర్ లను కొంటున్నట్లు ప్రకటించారు. మన రాష్ట్రానికి ఈ నెల 24వ తేదీ నుంచి 430కు పైగా టన్నుల ఆక్సీజన్ కేంద్రం నుంచి వస్తోంది. రెమ్ డెసీవర్ ఇంజెక్షన్ల కొరతపై ఇక్కడి బ్లాక్ మార్కెట్ కారణం అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ల బ్లాక్ మార్కెట్ ను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేక పోతుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్టాఫ్ లేదని..ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పై పని చేస్తున్న వైద్య సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని ఏరియా హాస్పిటళ్లను 100 బెడ్స్ కు అప్ గ్రేడ్ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. 

మొత్తం పైసలు కాళేశ్వరంలో పోసి, కమీషన్లు దండుకోవడంతో ప్రజా వైద్యానికి ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేకుండా పోయిందన్నారు. రోజు 2 TMCలనే ఎత్తిపోయడంలో ఫెయిల్ అయినప్పటికీ కమీషన్ ల కోసం  రూ.25000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కెపాసిటని 3 TMC లకు పెంచారన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉంది కాబట్టి.. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు వద్దని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయన్నారు. ఇంకా 5 నెలల వరకు ఈ ఎన్నికలని వాయిదా వేసే అవకాశం ఉంది కానీ.. లేటయితే ఓడిపోతామని భయపడి ఎన్నికలు పెట్టి రాష్ట్ర ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టారన్నారు. ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో  ఆక్సీజన్, మందుల పేరు చెప్పి కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు వివేక్ వెంకటస్వామి.