గ్రామాల్లో బలపడ్డాం : ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు

 గ్రామాల్లో బలపడ్డాం : ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు
  • పంచాయతీ ఫలితాలే ఇందుకు నిదర్శనం: ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు
  • 2028లో రాష్ట్రంలో అధికారం తమదే అని వెల్లడి

యాదాద్రి / హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలో బీజేపీ బలోపేతమైందని, పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సీట్లే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.​రాంచందర్ రావు అన్నారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన సభలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను ఆయన అభినందించారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో కేవలం 167 సర్పంచ్‌‌‌‌లనే గెలుచుకున్నామని, ఈసారి వెయ్యి సర్పంచ్‌‌‌‌లు, 10 వేల మంది వార్డు సభ్యులు గెలిచారని తెలిపారు. బీజేపీ నగరాలకు పరిమితమనే వారు ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. 

ఈ గెలుపు పార్టీ కార్యకర్తల కష్టానికి, గ్రామీణాభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శమని పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల అన్ని పంచాయతీల్లో పోటీ చేయలేకపోయామని, కానీ పోటీ చేసిన చోట మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులు, ఒత్తిడులు ఎదురైనా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, 2028లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 గ్రామాల్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంటే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ గ్రాఫ్ తగ్గుతోందన్నారు. బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌‌‌‌లో పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ వేముల అశోక్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గూడూరు నారాయణ రెడ్డి, పాశం భాస్కర్, దాసరి మల్లేశం ఉన్నారు. 

పైడిపల్లెలో రీ కౌంటింగ్ చేయాలి

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లె గ్రామం లో సర్పంచ్ ఎన్నికల మూడో విడత ఓట్ల లెక్కింపు సందర్భంగా గందరగోళం చోటుచేసుకుందని, అందుకే మళ్లీ రీకౌంటింగ్ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.