దళిత బంధు పై అసెంబ్లీలో చట్టం చేయాలి

దళిత బంధు పై అసెంబ్లీలో చట్టం చేయాలి

తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు బొడిగె శోభ. TRS లో ఉన్న దళిత నాయకులు.. మీ నియోజకవర్గంలో దళిత బంధు కోసం ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించారు.  కమీషన్ల కోసం SC,ST సబ్ ప్లాన్  నిధులను సీఎం కేసీఆర్ కాళేశ్వరం మీద పెట్టిండని అన్నారు. సిద్ధిపేటలో ఎమ్మెల్యే రఘునందన్ రావు చేస్తున్న దళిత బంధు సాధన దీక్ష కు హాజరైన బొడిగె శోభ..ఈ సందర్భంగా మాట్లాడారు.

సీఎం కేసీఆర్ సడ్డకుడు రవీందర్ రావు లక్షల రూపాయల రైతుబంధు తీసుకుంటున్నాడని.. రైతు బంధు కు లేని నియమాలు దళిత బంధుకు ఎందుకు అని అన్నారు బొడిగె శోభ. పెద్దోల్లకు ఇచ్చే పథకానికి లేని అడ్డంకులు పేదోళ్లకు ఇచ్చే పథకానికి ఎందుకని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ ను ఎదుర్కోలేక దళిత బంధు పేరుతో మాయమాటలు చెప్తున్నాడని ఆరోపించారు. 

మెదక్ జిల్లా లో పుట్టిన బిడ్డగా చెప్పుకుంటున్న కేసీఆర్ .. ఇక్కడ ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. హుజురాబాద్ కి వస్తున్న మంత్రులు ముందు వారి వారి నియోజకవర్గాల్లో దళిత బంధు ఇవ్వాలన్నారు. దళితులు కేసీఆర్ మోసాలకు బలి కావద్దని తెలిపారు. దళిత బంధు పై అసెంబ్లీలో చట్టం చేయాలని.. ఏ ప్రభుత్వం వచ్చినా దళిత బంధు ఇచ్చేలా చేయాలన్నారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఢిల్లీ పోయి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. 2023 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం పథకాలు రూపొందిస్తామని తెలిపారు.