కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి శివారులో కోతులు అస్వస్థతకు గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోతులను చంపేందుకు ఎవరైనా విషప్రయోగం చేశారా ? లేక మత్తుమందు ఇచ్చి వదిలేసి వెళ్లగా వికటించి చనిపోయాయా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
అంతంపల్లి శివారులో హైవే పక్కన పదుల సంఖ్యలో కోతులు అస్వస్థతకు గురి కావడాన్ని గుర్తించిన స్థానికులు, సర్పంచ్ మంజుల ఫారెస్ట్, పోలీస్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే ఆరు కోతులు చనిపోయి కనిపించాయి.
మిగతా కోతులు మత్తులో ఉండడంతో వాటికి వెటర్నరీ డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేయడంతో అవి కోలుకొని అడవిలోకి వెళ్లిపోయాయి. అయితే ఇతర గ్రామాల్లో కోతులను పట్టి.. ఇక్కడ వదిలేసి ఉంటారని స్థానికులు, ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.
