వేములవాడ, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా హాస్పిటల్‌లో బాలికలకు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 14 ఏండ్ల బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ, కొడుముంజ గ్రామంలో మేడలమ్మ కేతలమ్మ సమేత మల్లికార్జున స్వామి స్థిర విగ్రహ ప్రతిష్టకు ఆయన హాజరయ్యారు. అంతకుముందు రుద్రవరం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
కోనరావుపేట,వెలుగు: కాంగ్రెస్ పాలనలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, డైరెక్టర్లు మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సాగర్ పాల్గొన్నారు.
