వెలుగు ఓపెన్ పేజీ: ఆర్టికల్ 21 వర్సెస్ బెయిల్

వెలుగు ఓపెన్ పేజీ:  ఆర్టికల్ 21 వర్సెస్ బెయిల్

సుప్రీంకోర్టు  మాజీ  ప్రధాన న్యాయమూర్తి  చంద్రచూడ్​  ఇటీవల  బెయిలు గురించి కొన్ని కీలక  వ్యాఖ్యలు చేశారు.  అవి  కొత్తవి ఏమీ కాదు.  చాలాకాలంగా  రాజ్యాంగ కోర్టులు  అంటున్న మాటలనే  ఆయన ఉటంకించారు. శిక్ష పడటానికన్నా  ముందు  బెయిలు  ఇవ్వడమనేది  నియమం  అని  కొన్ని ప్రత్యేక  సందర్భాలు,  పరిస్థితులు ఉన్నపుడే   బెయిలును  తిరస్కరించాలని  ఆయన  అన్నారు.  నేరం  నిరూపణ  అయ్యేంతవరకు  ముద్దాయిని  నిరపరాధిగా పరిగణించాలని అన్నారు.  ముద్దాయి  విచారణ  జరిగి  విడుదలైతే  అతను  కోల్పోయిన  కాలాన్ని  ఎలా  భర్తీ  చేస్తారని  ఆయన  ప్రశ్నించారు. 

ఇక్కడితో  చంద్రచూడ్​ ఊరుకోలేదు.  సత్వర  విచారణ  అనేది  నిందితుని  హక్కు అని, విచారణలో  జాప్యం  ఉంటే  నిందితుడు  బెయిలు  పొందేహక్కు  కలిగి  ఉంటాడని  కూడా  ఆయన అన్నారు.  2020వ  సంవత్సరం నుంచి  నిర్బంధంలో  ఉన్న  ఉమర్​ ఖాలిద్​ కేసుని  కూడా  ఆయన  ప్రస్తావించారు.  ఆలస్యమైన కేసు  విచారణ  వల్ల  మానవ  నష్టం  జరుగుతుందని  అందుకు  ఉదాహరణగా  ఖాలిద్​  కేసుని ఆయన పేర్కొన్నారు. సంస్థాగత  భయాల కారణంగా  దిగువ కోర్టులు  తరుచుగా  బెయిలను  నిరాకరిస్తున్నాయని ఇది  సుప్రీంకోర్టుపై  అధిక భారాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు.  ఇంతవరకు బాగానే ఉంది.  కానీ,  చంద్రచూడ్ ​మొన్న మొన్నటి వరకు  సుప్రీంకోర్టు  ప్రధాన  న్యాయమూర్తిగా  పనిచేశారు.

  ఉమర్​ ఖాలిద్​  బెయిలు  దరఖాస్తుని  పరిష్కరించి  బెయిలు  మంజూరు  చేయవచ్చు.   ముద్దాయి  రకరకాల కారణాల వల్ల  ఏడుసార్లు  వాయిదా  తీసుకున్నారని ఆయన పదవీ విరమణ  చేసిన  తరువాత  బర్కాదత్​ చానల్​కి  ఇచ్చిన  ఇంటర్వ్యూలో  అన్నారు.  బెయిలు  కోసం  కోర్టుకు  వచ్చిన  వ్యక్తి  వాయిదా  ఎందుకు కోరతారు.  తన  బెయిలు  దరఖాస్తుని  ఎందుకు  ఉపసంహరించుకున్నారన్న  విషయం  సామాన్యుడికి  కూడా  తెలుసు.   చంద్రచూడ్​కి  తెలియదని అనుకోవాలా.   తన  బెంచికే  ఆ కేసుని వేసుకుని  ఎందుకు  ఆయన  పరిష్కరించలేదో  ఆయనకే  తెలుసు.  చంద్రచూడ్​ నేతృత్వంలోని  బెంచి రిట్​ పిటిషన్​లో  ఆర్నాబ్​ గోస్వామికి  సెలవు రోజుల్లో  బెయిలు  మంజూరు  చేశారు.   సుప్రీంకోర్టు  అరుదుగా  బెయిలు  దరఖాస్తులని  పరిష్కరించాలి.  కానీ,  కాలక్రమంలో అదే  ప్రధానమైన  వ్యవహారంగా  మారిపోయింది. బెయిలు  మంజూరు చేయడం  అనేది  కష్టమైన పనిగా  అన్ని  కోర్టులకి మారిపోయింది. 

బెయిల్​ రూల్​

బెయిలు  అనేది  రూల్.   జైలు  అనేది  మినహాయింపు.  ఇది  వ్యక్తిగత  స్వేచ్ఛని  కాపాడుతుంది.  రాజ్యాంగ స్ఫూర్తి పట్ల  నిబద్ధత  ఉన్నట్టు తోస్తుంది.  ఇటీవల  సంవత్సరాలలో  బెయిలు గురించి రకరకాలైన  భాష్యాలు కనిపిస్తున్నాయి.  ఒకసారి  బెయిలు  అనేది  నియమం అన్నట్టు  కనిపిస్తుంది.  కానీ,  చాలా కేసుల్లో  ఆ స్ఫూర్తి  కనిపించడం లేదు.   కొన్ని తీర్పులని  గమనించినపుడు  బెయిలు  అనేది  నియమంగా  కనిపిస్తుంది. నజీబ్ (2021),  సతీందర్​ కుమార్​ అంటిల్ (2022)లలో  వచ్చిన  తీర్పుల  ప్రకారం  కేసు  విచారణలో  జాప్యం  ఉన్నపుడు  వ్యక్తిగత  స్వేచ్ఛకి  ప్రాధాన్యం  ఇవ్వాలన్న  భావన  కలుగుతుంది.   జాతీయ  భద్రత  లేదా  ఆర్థిక నేరాలకు సంబంధించిన  కేసుల్లో  డిఫాల్టు  బెయిలు  మంజూరు  చేయాలన్న  తీర్పులు  వచ్చాయి.  ఇది  స్థిరమైన శాసనం (సెటిల్డ్  లా)  అనుకుంటున్న తరుణంలో  గుల్ఫిషా  ఫాతిమా  వర్సెస్​ స్టేట్​(2026) తీర్పు ద్వారా  ఇది  మళ్లీ అస్థిరంగా మారిపోయింది. 

న్యాయ వ్యవస్థలో వైరుధ్యం 

ఐదుగురు  నిందితులకు  షరతులతో  కూడిన  బెయిలు  మంజూరు చేస్తూ  ఉమర్​ ఖాలిద్​కి  షార్జిల్​ ఇమామ్​లకి  బెయిలుని  నిరాకరించింది.  వాళ్లు  గత  కొన్ని  సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు.  దీర్ఘకాలం జైల్లో ఉన్నప్పటికీ  బెయిలును  మంజూరు  చేయలేదు.  అలా నిరాకరించడానికి  చెప్పిన కారణం వాళ్లమీద ప్రాథమికంగా కేసు ఉందని కోర్టు ఈ దశలోనే  తేల్చింది.  దీర్ఘకాలం జైల్లో ఉండటాన్ని బెయిలు ఇవ్వడానికి కారణంగా చూపించకుండా  వారిమీద  ప్రాథమిక దృష్టితో చూసినపుడు నేరారోపణలు ఉన్నాయన్న కారణంగా బెయిలును ఇవ్వలేదు.  వ్యక్తిగత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని సుప్రీంకోర్టు తరుచూ ప్రకటిస్తూ ఉంటుంది. కానీ, సుదీర్ఘ విచారణ లేని  నిర్బంధం అనేది  బెయిలు మంజూరు  చేయడానికి  కారణంగా  సుప్రీంకోర్టు భావించడం లేదు.  ఇది  భారత న్యాయవ్యవస్థలోని  ప్రధానమైన వైరుధ్యం.  ఈ  ఉత్తర్వు అనేది నిర్దోషిత్వం అన్న భావనని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 

విచారణకు ముందే నేరం

మనీలాండరింగ్​ చట్టంలోని సెక్షన్​ 45,   మాదక  ద్రవ్యాల చట్టంలోని  సెక్షన్ 37 ప్రకారం, ఉపా చట్టంలోని సెక్షన్​ 43డి  ప్రకారం  బెయిలు  మంజూరు చేయడానికి  రెండు  షరతులకు  కోర్టు  సమాధానం  చెప్పాల్సి ఉంటుంది. మామూలు చట్టాలలో  బెయిలు  మంజూరు చేయాలంటే  ముద్దాయి  విచారణకు  హాజరవకుండా,  పారిపోయే  ప్రమాదం ఉందా?   సాక్షులని  బెదిరించే  అవకాశం ఉందా?  సాక్ష్యాలను  తారుమారు చేసే  పరిస్థితి  ఉందా అన్న విషయాలను  కోర్టు  పరిశీలించాల్సి ఉంటుంది.   పైన చెప్పిన  ప్రత్యేక చట్టాలలో  వీటికి  అదనంగా  జంట  షరతులను  ముందుగానే  అంచనా  వేయాల్సి ఉంటుంది.  ప్రాసిక్యూటర్​కి  నోటీసు ఇవ్వాలి.  అంతేకాదు అతను  బెయిలుని  వ్యతిరేకిస్తే   కోర్టు  ముద్దాయి  నేరం  చేయలేదని  సహేతుకమైన కారణాలు ఉన్నాయని కోర్టు సంతృప్తి  చెందాలి.  అలాంటి  సందర్బాలలోనే  బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుంది. 

ఆర్టికల్​ 21కి  భిన్నంగా షరతులు

కేసు  విచారణకు  ముందే  ప్రాసిక్యూషన్​  కేసు తప్పు  అని  నిందితుడు  రుజువు  చేసుకోవాల్సి  ఉంటుంది.  బెయిలు  కోరే  సమయంలో  ఇది సాధ్యమా?  కేసు  విచారణలు  ఎప్పుడు  పూర్తి  అవుతాయో  తెలియదు.  ముద్దాయిలు  జైల్లోనే  ఉండాలని  ‘రాజ్యం’  భావించిన  కేసుల విచారణలో  జాప్యం చేసే అవకాశం కూడా ఉంటుంది.  ఈ జంట  షరతులలో  ఉన్న కాఠిన్యాన్ని  ప్రాథమిక హక్కులతో   సమన్వయం  చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు గుర్తించి  కన్హయ్య  ప్రసాద్​ (2025) కేసులో చాలా కీలకమైన అంశాలని స్పష్టం చేసింది.   సత్వర విచారణ జరగనపుడు ఈ జంట షరతులు పూర్తిగా నేరవేర్చనప్పటికీ  బెయిలు ఇవ్వడం సమంజసం.  అయితే గుల్ఫిషా ఫాతిమా కేసులో  కోర్టు  దీనికి  భిన్నంగా  అభిప్రాయాన్ని తీసుకున్నట్టు  కనిపిస్తుంది.  దీర్ఘకాలంలో  జైల్లో ఉండటాన్ని బెయిలు మంజూరు చేయడానికి ఆధారంగా పనిచేయదన్న భావనలో  సుప్రీంకోర్టు ఉన్నట్టు గుల్ఫిషా కేసు  ద్వారా  తెలుస్తుంది.  సుప్రీం ఉత్తర్వులు  స్థిరంగా  లేనపుడు  దిగువ  కోర్టులు  బెయిలును  ఏవిధంగా  మంజూరు చేస్తాయి.  రాజ్యాంగంలోని  ఆర్టికల్​ 21కి  విభిన్నంగా  ఈ  జంట  షరతులు పరిణమించాయి.   మాస్టర్​ ఆఫ్​ ది  రోస్టర్​గా పనిచేసిన మాజీ ప్రధాన  న్యాయమూర్తి  జస్టిస్​ చంద్రచూడ్​ ఇప్పుడు  బెయిలు గురించి  మాట్లాడటం  అనవసర  ప్రస్తావనగా  అనిపిస్తుంది. 

 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. మంగారి రాజేందర్​
జిల్లా జడ్జి (రిటైర్డ్)