- ఒకరిని చూసి మరొకరు..
- నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని హామీ
మెదక్/ రామాయంపేట/శివ్వంపేట, సిద్దిపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ పై హామీల జోరు కొనసాగుతోంది. ఒకరిని చూసి మరొకరు తమను సర్పంచ్‌గా గెలిపిస్తే అమలు చేసే హామీలను బాండ్ పేపర్ పై రాసిస్తున్నారు. జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పలు గ్రామాల్లో సర్పంచ్అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసివ్వగా, మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం పలువురు అభ్యర్థులు ఇదే పంథాలో ముందుకు వెళ్తున్నారు.
రామాయంపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మాటలు చెబితే నమ్ముతారో లేదో అని బాండ్ పేపర్ల మీద హామీ రాసిస్తున్నారు. మండలంలోని ప్రగతి ధర్మారం సర్పంచ్ అభ్యర్థి ముస్కుల శ్రీకాంత్ రెడ్డి తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద తొలగిస్తానని, శాశ్వత మద్యపాన నిషేధం అమలుతో పాటు యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని అవి నెరవేర్చక పోతే పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇస్తూ బాండ్ పేపర్ రాసిచ్చాడు.
ఇదే మండలం అక్కన్నపేటలోనూ కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి రాంకీ ఎన్నికల హామీలను బాండ్ పేపర్ పై రాసిచ్చాడు. గ్రామంలో కోతుల బెడ దతో పాటు తాగునీటి సమస్య తీరుస్తానని, వీధిలైట్లు, మురికి కాల్వలు, సీసీ రోడ్లు, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, స్థానిక యువతకు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామంలో రైల్వే స్టేషన్ లో అజంతా ఎక్స్ ప్రెస్ ఆగడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ బాండ్ పేపర్ రాసిచ్చాడు.శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ బాండ్‌పేపర్ పై 6 హామీలు రాసి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాడు.
ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి రూ.4 వేల బహుమతి, ఆడపిల్లల పెళ్లికి రూ.5 వేల ఆర్థిక సాయం, తీజ్ పండుగ నిర్వహించే వారికి రూ.10 వేలు, గ్రామంలో ఉన్న ప్రతీ దేవాలయనికి బోనాలు, జాతర్ల నిర్వహణకు రూ.10 వేలు విరాళం ఇస్తానని, గ్రామంలోని ప్రతి ఒక్క దేవాలయం వద్ద బోరు వేయిస్తానని, గ్రామంలో ఎవరైనా ఆకాల మరణానికి గురైతే బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కలెక్టర్ ద్వారా, జిల్లా న్యాయస్థానం ద్వారా సర్పంచ్ పదవి నుంచి తొలగించవచ్చని బాండ్ పేపర్లో రాసిస్తున్నాడు.
సిద్దిపేట జిల్లాలో..
పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం బాండ్ పేపర్లపై హామీలను రాసి ఇవ్వడం ట్రెండ్ గా మారింది. సర్పంచ్ గా ఎన్నికైతే తాము గ్రామానికి చేసే అభివృద్ధి చేపట్టే కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా బాండ్ పేపర్లపై రాసి విడుదల చేస్తున్నారు. ఇదే సందర్భంలో వచ్చే ఐదేండ్లలో తాము ఎలాంటి అవినీతికి పాల్పడబోమని ప్రస్తుతం ఉన్న ఆస్తుల కంటే ఐదేళ్లలో ఒక్క రూపాయి పెరిగినా వాటిని గ్రామ పంచాయతీకే ఇస్తామని బాండ్ పేపర్లలో పేర్కొంటున్నారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి కుల సంఘ భవనాల నిర్మాణానికి బాండ్ పేపర్ల మీద హామీ ఇస్తున్నారు. నంగునూరు మండలం రాజగోపాలపేట సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణి రాధాకృష్ణ, చేర్యాల మండలం తాడూరు సర్పంచ్ అభ్యర్థి బొడిగె నర్సింలు, సిద్దిపేట మండలం పుల్లూరు సర్పంచ్ అభ్యర్థి బక్క రాణి శ్రీనివాస్ సర్పంచ్ గా గెలిస్తే గ్రామ అభివృద్ధికి చేసే పనులను బాండ్ పేపర్ల పై రాసి సంతకాలు చేసి విడుదల చేశారు. జిల్లాలోని సిద్దిపేట, చేర్యాల, చిన్నకోడూరు, జగదేవ్ పూర్ మండలాలతో పాటు పలు గ్రామాల్లో అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసి విడుదల చేయడం చర్చానీయాంశంగా మారుతున్నాయి.
బాండ్ పేపర్లో మేనిఫెస్టో
నారాయణ్ ఖేడ్: నాగలిగిద్ద మండలం ముక్తాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుభాష్ చంద్రబోస్ బాండ్ పేపర్ పై కొన్ని వింత హామీలను ప్రకటించాడు. అందులో సర్పంచ్ గా నెలకు ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటానని, వార్డ్ మెంబర్లకు ఏడాదికి రూ.1016 జీతం ఇస్తానని, గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కు ఏడాదికి 10,000, ఆలయాల్లో పూజారులకు ఏడాదికి రూ.2,016 చెల్లిస్తానని, గెలిచిన 11 రోజుల్లో గ్రామంలో నీటి సమస్య కోసం పైప్ లైన్ ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ పై రాసి ప్రచారం చేస్తున్నాడు.

