బీఆర్ఎస్ నేతలను బద్నాం చేసే ప్రయత్నం : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలను బద్నాం చేసే ప్రయత్నం : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
  •     ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శ

హైదరాబాద్, వెలుగు: సీబీఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆ రెండు పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ నేతలపై బురద జల్లేందుకు ఒకే స్క్రిప్ట్ ప్రకారం పనిచేశారని చెప్పారు.  హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 33 సార్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. సోమవారం వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో  మాట్లాడారు. 

ఎక్కువ మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీలో ఒకే సభ్యునికి అవకాశం ఇచ్చారు అందులోనూ కేవలం 80 నిమిషాలు మాత్రమే కేటాయించారని వివరించారు. అదే, ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం.. మొత్తం 90 నిమిషాలు సమయం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రూ. 94 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటా హుటిన నాలుగు రోజుల్లో ఎన్డీఎస్ఏ రావడం, ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పెద్దవాగు కొట్టుకుపోతే, సుంకిశాల గోడ కూలిపోతే, వట్టేం పంప్ హౌస్ నీళ్లలో మునిగితే, ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది చనిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని నిలదీశారు. ఎలక్షన్స్ వచ్చాయంటే సీఎం రేవంత్, బండి సంజయ్ ఏదో ఒక నాటకానికి తెరతీస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టి గోదావరి జలాలను బనకచర్ల  పంపించడాకి చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.